Wednesday, October 4, 2017

యమున నది మరింత కలిషితం....ఫోటోలు


యమున భారతీయులకు పవిత్రమైనది. యమునలో స్నానమాచరిస్తే అకాల మృత్యుదోషం హరించుకుపోతుందని ఒక నమ్మకం. కాని ఢిల్లీలో ఉన్న యమునా నదిలో స్నానమాచరిస్తే మృత్యువు ఖాయం అని అక్కడ ఉన్న కలుషిత యమున హెచ్చరిస్తోంది.

తాజాగా వచ్చిన ప్రభుత్వం యమునను శుభ్రం చేస్తానని ఆర్భాటం చేసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ యమున బాగోగులు మూడేళ్లలో తేలుస్తామని అన్నది. కాని యమున నది మాత్రం ఢిల్లీలో రోజు రోజుకీ మురికి కూపంగా మారి ప్రజలకు విషం సరఫరా చేస్తోంది. దీని చుట్టుపక్కల పండే ఆకుకూరలు, కూరగాయలు కేన్సర్‌ కారకాలని పరీక్షలు నిర్థారణ చేస్తున్నాయి. యమున విషకాసారం కావడం వల్ల చుట్టుపక్కల పల్లెల్లోని భూగర్భ జలాలు విషతుల్యమై కీళ్ల నొప్పులు, వాతం, ఇతర అనారోగ్యాలు కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ఢిల్లీ పేదసాదలు యమునపై భక్తితో ఈ మురికి యమునలోనే మునకలు వేస్తుంటారు. సంధ్య వారుస్తుంటారు. పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.

ప్రపంచంలో అత్యంత కలుషితమైన పది నదుల్లో ఒకటి యమున. టన్నుల కొద్దీ వ్యర్థాలను ప్రతిరోజు యమున నదిలో పడేస్తున్నారు. చెత్త చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలతోపాటు మురికినీళ్ళను యమున నదిలోకి వదులుతున్నారు. దేశ రాజధాని సమీపంలోని యమునా నదిలోనే నగరానికి సంబంధించిన కాలుష్యాన్నంతా వదులుతున్నారు.

యమున నదికి ఇంత ప్రమాదం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవటంలేదు.....దీనికి ఉదాహరణే: దసరా పండుగ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో తయారైన దుర్గా దేవి విగ్రహాలను విచ్చలవిడిగా యమున లో కలపటమే. దీని వలన యమున మరింత కలుషితం అవుతోంది.

ఈ విషాదం నుంచి యమున ఎప్పటికి విముక్తమవుతుందో! మానవ పాపాల నుంచి ఎప్పటికి బయట పడుతుందో!!


No comments:

Post a Comment