Friday, September 1, 2017

మిస్టరీ: టైం మెషీన్/కాల యంత్రం ఉన్నదా?....ఫోటోలు మరియు వివరణ


ది టైం మెషీన్ లేదా కాల యంత్రం అనేది సుప్రసిద్ధ పాశ్చాత్య సైన్సు ఫిక్షన్ రచయిత హెచ్.జి.వెల్స్ సృష్టి. ఇందులో కూర్చుని భూత మరియు భవిష్యత్ కాలాలను సందర్శించవచ్చు. ఈయన రాసిన నవల ఆధారంగా కొన్ని ఆంగ్ల సినిమాలు చిత్రీకరించబడ్డాయి. తెలుగులో కూడా కాల యంత్రం మీద సినిమా వచ్చింది.

నిజంగానే కాల యంత్రం ఉన్నదా?...ఉండేదా?...ఉండేందుకు అవకాశం ఉన్నదా...? అన్న ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పకపోయినా కాల ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నదని ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గత కాలం/గత చరిత్ర లోకి వెళ్లటం, అంటే ఈజిప్ట్ పిరమిడ్లను చూడటం లాంటివి సాధ్యం కాదు, కానీ భవిష్యత్తులోకి వెళ్లవచ్చు అంటున్నారు అదే శాస్త్రవేత్తలు.

కాల ప్రయాణానికి అవకాశం ఉన్నదనే సిద్ధాంతానికి మొట్టమొదట పునాది వేసింది సైద్ధాంతిక భౌతికవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంతకు ముందే శాస్త్రవేత్తలు గెలీలియో మరియు హెన్రీ పాయంకేర్, కాల ప్రయాణ సిద్ధాంతానికి అవకాశమున్నదని తెలిపినా ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రజలలో కాల ప్రయాణం సాధ్యమే నన్న నమ్మకాన్నీ, ఆశనూ బలపరిచింది.

ఈ ఆశ వచ్చిన తరువాత కొంతమంది శాస్త్రవేత్తలు టైం ట్రావల్ సాధ్యమే అనడానికీ, టైం ట్రావల్ జరిగింది అని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు సేకరించి ప్రజల ముందు ఉంచేరు. కొన్ని ప్రభుత్వాలు ఈ విషయం మీద నోరు మెదపటంలేదు(సాధ్యమే అని చెప్పడంలేదు, సాధ్యం కాదని చెప్పడంలేదు). అందువలన ఈ కాల ప్రయాణం విషయం ఒక మిస్టరీగానే ఉంటోంది.

కాల ప్రయాణం గురించి ప్రజలముందు ఉంచిన సాక్ష్యాలు ఏమిటో మనం కూడా తెలుసుకుందాం.

ఫోటో-1......1792 లో అమెరికా దేశం న్యూయార్క్ నగరానికి దగ్గరలో మాంటౌక్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మించేరు. దీనిని రహస్య స్థావరంగానే ఉంచేరు. "ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కాదు...ఇక్కడ రహస్య భారీ భూగర్భ కాల ప్రయాణ పరిశోధనా కేంద్రం నిర్మించేరు" అని వదంతి పుట్టింది. 1980 లో ఈ పరిశొధనా కేంద్రంలో పనిచేసిన ప్రెస్టన్ నికోలాస్ మరియు ఆల్బైలెక్ అనే ఇద్దరు మనుష్యులు బయటకు వచ్చి చెప్పిన కొన్ని విషయాలు వదంతులను బలపరిచేయి. "ఆ పరిశొధనా కేంద్రంలో అనిచివేయబడ్డ మా జ్ఞాపకశక్తిని మేము తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాము" అని తెలిపేరు. ఆ పరిశొధనా కేంద్రంలో కాల ప్రయాణాల గుహలు తవ్వి శాస్త్రవేత్తలను 1943 వ సంవత్సరానికి పంపేరని ప్రజలు నమ్ముతున్నారు. ఈ పరిశోధనా కేంద్రాన్ని అమెరికా నౌకా దళం యుద్ధాలలో తమ యుద్ధ నౌకలు శత్రు సేనలకు కనిపించకుండా(అదృశ్య)ఉండాలని, శత్రుదేశాల రాడార్లలో గుర్తింపు కాకుండా ఉండాలనే పరిశోధనలకు నిర్మించేరని(Philadelphia Experiment) చెబుతారు. కానీ అమెరికా ప్రభుత్వం ఈ రెండు పరిశోధనలనూ తాము చేయలేదని, ఇదంతా పుకారులేనని తెలిపేరు. ఈ పరిశోధనా కేంద్రం 1981 వరకు పనిచేసింది. ఆ తరువాత మూసివేయబడింది. 2002 లో అమెరికా ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని ఒక ప్రభుత్వ పార్కుగా మార్చి పర్యాటకులు చూడటానికి అనుమతి ఇచ్చింది. అయితే పర్యాటకులు ఈ పరిశోధనా కేంద్రంలోపలకు వెళ్ళి చూడలేరు. ఎందుకంటే చుట్టూ ఒక కంచే అమర్చేరు.

ఫోటో-2: ఈ అద్భుతమైన చారిత్రక కళాత్మక చిత్రం 500 సంవత్సరాల క్రిందదట. ఈ చిత్రం పురాతన నాగరికతలలో లాప్ టాప్ లు వాడబడ్డాయి అని తెలుపుతోంది. దీనిని రెండు విధాలుగా అనుకోవచ్చు. కాల ప్రయాణం లేదా అంతరిక్షంలో నుండి వచ్చిన పర్యాటకులుగా తీసుకోవచ్చు.

ఫోటో-3...ఫోటో-2 సాక్ష్యం కాదు అనిపిస్తే, ఫోటో-3 ను చూడండి. ఈ ఫోటో ఫేస్ బుక్ ఆఫీసు ఆవరణలో ఈ మధ్య తీయ బడింది. ఈ కారు భవిష్యత్తుకు చెందింది. ఎందుకంటే ప్రపంచంలోని కార్లు తయారుచేసే ఏ కంపెనీ ఈ కారు మేము తయారుచేసినదేనని చెప్పటానికి ముందుకు రావటంలేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ కారు నీలి రంగు గీతలు వేయబడ్డ చోటులో నిలబెట్టబడి ఉన్నది. నీలి రంగు గీతలలో ఫేస్ బుక్ ఉద్యోగస్తులు మాత్రమే కారు నిలపాలట. కాల ప్రయాణం గురించిన పరిశోధనలను ఫేస్ బుక్ సంస్థ నిర్వహిస్తోందా అన్న అనుమానం అక్కడి ప్రజలలో చోటుచేసుకుంది.

ఫోటో-4......డిసెంబర్-2008 లో చైనా పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు షాంగ్సీ పట్టణంలో 400 సంవత్సరాలుగా మూసే ఉన్న అతిపెద్ద సమాధిని తవ్వేరు. ఈ సమాధిలో 400 ఏళ్ల క్రితం చనిపోయిన చైనా చక్రవర్తి సీ కుయింగ్ యొక్క శవపేటికను కనుగొన్నారు. అత్యంత పాతదైన ఆ పెట్టెను తెరిచి లోపల ఎలా ఉన్నదో చూడాలనుకున్న ఆ శాస్త్రవేత్తలకు ఎముకల ముక్కలతో పాటు చేతి గడియారంలా ఉన్న ఒక బంగారు ముక్క కనిపించింది. తీసి చూసి ఆశ్చర్యపోయేరు. కారణం, అది నిజంగానే చేతి గడియారం. 10 గంటల 6 నిమిషాల దగ్గర ఆగిపోయిన ఆ చేతి గడియారం వెనుక "స్విస్" అనే అక్షరాలు ముద్రించబడి ఉన్నాయి. ఆ గడియారం 100 సంవత్సరాల క్రితందేనని తెలుసుకున్నారు. అది తెలుసుకుని "మేమందరం ఉలిక్కిపడ్డము" Jiang Yanyu, Guangxi మ్యూజియం క్యురేటర్ అన్నారు. ఈ వార్తను ప్రపంచ పత్రికలు ప్రచురించిన తరువాత, 15-16 వ శతాబ్ధాలలొని మింగ్ రాజవంశం రాజు యొక్క శవపేటికలోకి ఈ చేతి గడియారం ఎలా వచ్చింది?...ఈ ప్రశ్న ప్రపంచ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాల ప్రయాణం ఉండేది అని చాలామంది నమ్ముతున్నారు.

ఫోటో-5.....మొదటగా వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రికలొ వచ్చిన ఈ వార్తను, ఆ తరువాత యాహూ ప్రచురించిన తరువాత మిగిలిన అన్ని పత్రికలు ప్రచురించినై. ఆండ్ర్యూ కార్లసిన్ అనే ఇతను న్యూ యార్క్ స్టాక్ ఎక్చేంజ్ లో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నాడని ఖైదుచేయబడ్డాడు. ఇతను బైలులో బయటకు వచ్చేడు. కానీ కనిపించకుండా పోయేడు. ఇతను చేసిన వ్యాపార పద్దతులను గణించి ఇతను 2256 వ సంవత్సరానికి చెందినవాడని నిర్ణయించేరు. కాల ప్రయాణం తో ఇక్కడికి వచ్చుంటాడని అనుమానం వ్యక్తం చేసేరు.

ఫోటో-6 .....ఆశ్చర్య పరిచే కాలప్రయాణ హత్య...... 1977 లో లండన్ నగరంలో హత్య చేయబడ్డ ఒక మహిళ దేహం దొరికింది. మహిళ శవాన్ని చేజిక్కించుకున్న లండన్ పోలీసులు శవ పరీక్ష జరిపించేరు. హత్య గావించబడ్డ మహిళ చేతి గోర్లలో హత్య చేసిన హంతకుని రక్తం కనుగొనబడింది. డి.ఎన్.ఏ పరిక్షలో హంతకుని వివరాలు దొరికేయి. హంతకుడిని పట్టుకోవటానికి వెళ్ళిన పోలీసులకు వారు వెతుకుతున్న హంతకుడు చనిపోయి చాలాకాలమైందని తెలుసుకుని ఆశ్చర్యపోతూ అదే విషయాన్ని శవ పరీక్ష జరిపిన డాక్టర్. మైక్ సిల్వర్ మ్యాన్ కు తెలిపేరు. ఆయన మరికొన్ని పరిశోధనలు జరిపి ఈ హత్య చేసినవారు కాల ప్రయాణం చేసి వచ్చుంటాడని తెలిపేరు.

ఫోటో-7..... స్పెయిన్ దేశంలోని సలమంకా కాతడ్రల్ చర్చ్ లో చెక్కిన ఈ ఫోటోలోని ఆస్ట్రొనాట్ విగ్రహం మరొ సాక్ష్యం అంటున్నారు. 16 వ శతాబ్ధంలో కట్టడం మొదలుపెట్టి 18 వ శతాబ్ధంలో పూర్తి అయిన ఈ చర్చ్ లో ఇలాంటి విగ్రహాన్ని చెక్కాలని ఎవరు ఊహించి ఉంటారు.

ఫోటో-8 చైనా దేశం నో కమెంట్ అని చెప్పింది.

కాలప్రయాణం గురించిన మిస్టరీ ఎప్పుడు వీడి పోతుందో వేచి చూడాలి.

2 comments:

  1. పోస్ట్ చాలా చాలా బాగుంది సర్... టైం మిషీన్ గూర్చి కొత్త విషయాలు తెలుసుకున్నాను.. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete