Monday, June 12, 2017

మట్టి అగ్నిపర్వతం.....ఫోటోలు మరియు వివరాలు

అగ్నిపర్వతం అంటే మనకు సర్వసాధారణంగా కలిగే అవగాహన ఏమిటంటే ఒక శంఖు ఆకారపు పర్వతం. ఆ అగ్నిపర్వత శిఖరాగ్ర బిలం నుండి ఉష్ణ ద్రవం విష వాయువులను వెదజల్లుతూ ఉంటుంది. ఇది ప్రకృతికి సంబంధించినది.

కానీ మట్టి అగ్నిపర్వతం అనేది చాలామంది విని ఉండరు. చూసుండరు. కారణం, మట్టి అగ్నిపర్వతాలు అనేది ఎక్కడా సహజంగా ఏర్పడ్డ సూచనలు లేవు. ఇది ప్రకృతికి సంబంధించినది కాదు. అలాంటిది, ఇండోనేషియా దేశంలో 2006 లో భూమి క్రింద నుండి వచ్చిన ఒక మట్టి అగ్నిపర్వతం బద్దలై, బురదను విరజిమ్ముతూ, Sidoarjo అనే గ్రామాన్ని బురదతో ముంచెత్తి 30,000 మందిని స్థానభ్రంశం చేసింది. భూగోళ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయేరు. ఆ మట్టి అగ్నిపర్వతం ఇప్పటి వరకు(2006 నుండి 2017)ఆగకుండా బురదను విరజిమ్మితూ వైశాల్యంలో పెద్దదవుతున్నది. ఈ మట్టి అగ్నిపర్వతం కనీసం మరో 16 సంవత్సరాలు బురదను విరజిమ్ముతూ, మరింత పెద్దదయ్యే అవకాశం ఉన్నదని ఈ మట్టి అగ్నిపర్వతమును పరిశోధించిన భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

(Sidoarjo అనే గ్రామాన్ని బురదతో ముంచెత్తి 30,000 మందిని స్థానభ్రంశం చేసిన మట్టి అగ్నిపర్వతం)
ఉత్తర కొలంబియాలో 15 మీటర్ల ఎత్తుకు ఒక మట్టి కొండ ఉన్నది. ఆ మట్టి కొండపైన బురద ఉంటుంది. ఆ బురదలో స్నానమాడితే వ్యాధులు రావని కొందరి నమ్మకం. దీనిని అక్కడి ప్రజలు మట్టి అగ్నిపర్వతం అంటారు. భూగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ మట్టి కొండ మానవులచే డబ్బుకోసం రూపొందించబడింది. ప్రభుత్వం ఈ చోటును ప్రత్యేక ప్రదేశముగా వివరించటంలేదు. ఎవరో కొంతమంది(ఆ మట్టి కొండ దగ్గర ఉన్నవారు)ఆ మట్టి కొండకు చెక్కతో నిచ్చెన చేసి పర్యాటకులను మోసగిస్తున్నారు. "ఇది ఒకప్పడు ఒక అగ్నిపర్వతం. ఇది పేలినప్పుడు దేవదూతలు దీనిని మంత్రపు నీరు చల్లి చల్లర్చేరు. అదే ఇప్పుడు బురదగా మారింది. ఈ బురదలో స్నానం చేస్తే వ్యాధులు రావు" అని పర్యాటకులకు కధలు చెబుతూ వారిలో మూఢ నమ్మకమున్న వారిని పైకి తీసుకువెళ్ళి వారే బురదలోకి తోసి, పర్యాటకులు పైకి వచ్చిన తరువాత వారి దగ్గర డబ్బు గుంజుతారట. కానీ ఇది నిజమైన మట్టి అగ్నిపర్వతం కాదు.

(కొలంబియాలో మట్టికొండ)
ఇండోనేషియాలోని ఈ మట్టి అగ్నిపర్వతం 2006- మే నెల బద్దలైంది. రోజుకు 1 లక్ష క్యూబిక్ మీటర్ల బురదను విరజిమ్ముతోంది. Sidoarjo అనే గ్రామంలోని పలు ప్రాంతాలను బురదతో నింపేసింది. ఈ మట్టి అగ్నిపర్వతమునకు Luci అని పేరు పెట్టేరు. ఈ మట్టి అగ్నిపర్వతం ఆగకుండా బురదను విరజిమ్ముతూ పోతే Sidoarjo గ్రామ ప్రాంతమంతా మునిగిపోతుందని భూగోళ శాస్త్రవేత్తలు లెక్క కట్టేరు.

(ఇండోనేషియాలోనే Wirosari అనే మరోచోట పేలుతున్న బురద అగ్నిపర్వతం)
సదా వేడి, వేడి బురదను విరజిమ్ముతున్న ఈ మట్టి అగ్నిపర్వత ద్వారమును ఎలాగైనా మూసివేయాలని, లేకుంటే కొన్ని సంవత్సరాలలో అది ఇండోనేషియా దేశానికే కాకుండా ప్రపంచ వాతావరణానికి విపరీత నష్టం కలిగిస్తుందని ద్వారము చుట్టూ ఒక డ్యామును కట్టడమే కాక 1500 కాంక్రీట్ బంతులతో బురద వస్తున్న ద్వారమును నింపాలని తీర్మానించుకుని, అత్యంత మేధావులైన ఇంజనీర్లతో కలిసి పనిమొదలుపెట్టేరు. కానీ ఫలితం దక్కలేదు. కడుతున్నప్పుడే డ్యాము గోడలు బురద బరువుకు కూలిపోవడం, ఎన్ని కాంక్రీట్ బంతులు ద్వారములో వేసినా ద్వారము నిండకపోవడంతో ఆ పనిని ఆపేసేరు.

74 ప్రపంచ భూగోళ శాస్త్రవేత్తలను పిలిపించి మట్టి అగ్నిపర్వతం గురించి ఆరాలు తీయమన్నారు. 74 భూగోళ శాస్త్రవేత్తలలో 44 మంది భూమి క్రింద ఉన్న మట్టి అగ్నిపర్వతం బద్దలై పైకి రావడానికి ఆ ప్రదేశంలో చమురు తీస్తున్న Lapindo Brantas oil and gas company కారణమని తేల్చి చెప్పేరు. అనుకున్నదానికంటే ఎక్కువగా తవ్వకాలు చేయడంవలనే మట్టి అగ్నిపర్వతం పైకి వచ్చిందని తెలిపేరు.

Lapindo Brantas oil and gas company భూగోళ శాస్త్రవేత్తలు, కారణం మా తవ్వకాలు కాదని, రెండు రోజులకు ముందు ఇండోనేషియాని ఒక ఊపు ఊపిన భూకంపమే కారణమని వాదాడేరు. 74 భూగోళ శాస్త్రవేత్తలలో ముగ్గురు శాస్త్రవేత్తలు భూకంపమే కారణమని తెలిపేరు. మరో 16 మంది సాక్ష్యం సరిపోలేదని, కాబట్టి ఎటువంటి నిర్ణయానికీ రాలేక పోతున్నామని తెలిపేరు. మిగిలిన 13 మంది Lapindo Brantas oil and gas company మరియు భూకంపం రెండూ కారణాలేనని తెలిపేరు.

30,000 కుటుంబాలను స్థానభ్రంశం చేసి, వారిని విపరీత నష్టానికి గురిచేసిన ఈ మట్టి అగ్నిపర్వతం ఎలా బద్దలై పైకి వచ్చిందో తెలుసుకునే పరిశోధనను ఇండోనేషియా ప్రభుత్వం ఇంకా విడిచిపెట్టలేదు. 77 మిల్లియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని Lapindo Brantas oil and gas company ఆ 30,000 కుటుంబాలకు చెల్లించ వలసిందేనని పట్టుబడుతోంది.

ఇండోనేషియాలోనే Wirosari అనే మరోచోట కూడా మట్టి అగ్నిపర్వతం బద్దలవుతోంది. కానీ ఇది పూర్తిగా బద్దలవటంలేదు. అప్పుడప్పుడు ఆకశ్మికంగా బురదను పైకి విరజిమ్ముతోంది. ఇది కూడా(ఈ మట్టి అగ్నిపర్వతం) చమురు తీసే చోటున ఉన్నది. అయితే ఈ అగ్నిపర్వతం వలన ప్రజలు నష్టపోలేదు. అందుకు విరుద్దంగా లాభాలు పొందుతున్నారు. అప్పుడప్పుడు పైకి ఉబికి వస్తున్న వేడి వేడి బురదను చూడటానికి పర్యాటకులు ఈ చోటుకు వస్తున్నారు. ప్రజలు వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మట్టి అగ్నిపర్వత ప్రదేశాన్ని "bledug" అని పిలుస్తున్నారు.

మన దేశంలో జరిగిన బోపాల్ గ్యాస్ ప్రమాద బాధితుల దావాలను ఎలా పట్టించుకోవటంలేదో ఈ మట్టి అగ్నిపర్వతం వలన నష్టపోయిన ప్రజల దావాలు కూడా అలాగే ఉన్నాయి.

No comments:

Post a Comment