Monday, May 29, 2017

మిస్టరీ: సైబీరియాలో నరకలోకం ?...వివరాలు, ఫోటోలు మరియు వీడియో

మీకు నరకం అనే దాని మీద నమ్మకం ఉందా? నమ్మకముంటే అది ఎక్కడున్నది అనే దానిమీద మీ అభిప్రాయం ఏమిటి? స్వర్గలోకం, నరకలోకం ఉన్నదని మన పురాణాలు చెబుతున్నాయి . అవి నిజమైన ప్రదేశాలా? లేక సృష్టించబడ్డ ప్రదేశాలా?.....ఇవి మన హిందూ పురాణాలలోనే కాకుండా, అన్ని మతాల పురాణాలలోనూ ఉదహరించబడి ఉన్నాయి.

అసలీ స్వర్గం, నరకం అంటే....1) తప్పు చేసినవారు నరకానికి వెడతారు, అక్కడ శిక్షలు అనుభవిస్తారు. 2) పుణ్యం చేసినవారు స్వర్గానికి వెడతారు, అక్కడ సర్వ సుఖాలూ అనుభవిస్తారు. ఈ రెండూ నిజమేనా?....ఒక వేళ ఇవి ఊహ అయితే మరి మన పూరాణాలలో ఉండే ఇంద్రుడు, వజ్రాయుధం, కల్పవృక్షం, ఐరావతం, యముడు, శిక్షలు ఇవన్నీ అబద్ధాలా?.....ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్పలేరు. ఒకరు చెబితే మరొకరు ఒప్పుకోరు. కాబట్టి ఎవరికి వారే చెప్పుకోవాలి. అదే జరిగింది.

Kola Super deep Borehole: 2007 లో తీసిన ఫోటో

భూగోళ భౌతికశాస్త్ర పరిశోధనల కోసం "కోలా సూపర్ డీప్ బోర్ హోల్ (Kola Super deep Borehole)" అనే పేరుతో అలనాటి యూ.ఎస్.ఎస్.ఆర్(USSR)1970లో ఒక పరిశొధన మొదలు పెట్టింది. భూమి కింద ఎంత లోతులో టెక్టోనిక్ ప్లేట్లు (భూకంపాలకు ముఖ్య కారణం ఇవే) ఉన్నాయో తెలుసుకోవటానికి ఈ పరిశోధనా ప్రాజెక్ట్ మొదలుపెట్టేరు. అందుకుగానూ మే నేల-24, 1970 న బోరు తవ్వకం ప్రారంభించారు.

భూమి లోపలి భాగం: శాస్త్రవేత్తల డిజైన్ చిత్రం

14.4 కిలోమీటర్ల లోతుకు బోరును తవ్విన తరువాత, శాస్త్రవేత్తల బృందానికి ఏవో శబ్ధాలు వినబడటంతో బోరు తవ్వకాన్ని ఆపేశారు. మొదట్లో ఆ శబ్ధాలు తాము తవ్వటానికి ఉపయోగిస్తున్న యంత్రాలలో నుండి వస్తున్నదని అనుకుని, యంత్రాలలో సర్దుబాట్లు చేసి మళ్ళీ తవ్వడం మొదలుపెట్టారు. ఈ సారి భయంకరమైన కేకలు/అరుపులు/ఏడుపులు వినబడ్డాయి. ఒక కేక, ఒక అరుపు లేక ఒక ఏడుపో కాదు, కొన్ని లక్షల మానవుల కేకలు, అరుపులు, ఏడుపులు వినబడ్డాయి. అవి నొప్పులతో భాధ పడుతున్నప్పుడు అరిచే అరుపులలాగా ఉన్నాయి. శాస్త్రవేత్తల బృందం భయకంపితులయ్యారు. తవ్వడం ఆపేశారు.
బోరులోకి తొంగి చూశారు. ఎవరి కంటికి ఏమీ కనబడలేదు. మళ్ళీ యంత్రాలను సర్దుబాటు చేసి తవ్వకం మొదలు పెడదామని అనుకున్నారు. కానీ శాస్త్రవేత్తల బృందంలో ఒకరు బొరు తవ్వకంలో మామూలుగా చేసే మిగిలిన పరిశోధనలను ఒకసారి జరిపి ఆ తరువాత తవ్వకం మొదలు పెడదాం అని చెప్పేరు.

తవ్వినంత వరకు (తవ్విన చోట: అంటే 14. 4 కిలోమీటర్ల కింద) ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి ఊష్ణోగ్రతను తెలుసుకునే పరికరాన్ని లోపలకు పంపేరు. అధిరిపడ్డారు. ఉష్ణోగ్రత చూపే పరికరంలో ఉష్ణోగ్రత చూపే సూచిక దాటిపోయింది. అంటే అక్కడ ఒక అగ్ని గుండం వెలుగుతున్న ఉష్ణోగ్రత ఉన్నది. అంటే అక్కడ 2000°C పైనే ఉష్ణోగ్రత ఉండవచ్చు.

నరకం ఊహా చిత్రం

తవ్వకంలో ఎప్పటికప్పుడు భూమిలోపల వచ్చే శబ్ధాలను వినడానికి/ నమోదుచేయడానికి సున్నితమైన మైక్రోఫోన్ పంపి శబ్ధాలు వింటూ ఉంటారు. ఆ పరికరాన్ని(Super Sensitive Microphone) లోపలికి పంపేరు. అందులో వినబడ్డ శబ్ధాలు శాస్త్రవేత్తలలో వొణుకు తెప్పించింది. కొందరైతే శిలల లాగ అయిపోయారు. భయంకరమైన అరుపులు, ఏడుపులతో ఆచోటే దద్దరిల్లింది.

తవ్వకాన్ని పూర్తిగా ఆపేసేరు. శాస్త్రవేత్తల బృంద నాయకుడు డాక్టర్.అజ్జకోవ్ (Dr.Azzacove....ఈయనకు దేవుడు, పురాణ పుస్తకాలు, నరకాల మీద నమ్మకంలేదు) ఈ విషయాన్ని తెలుపుతూ “నరకానికి దారి కనుగొన్నాము ” అని ఫిన్లాండ్ దేశ ప్రఖ్యాత వార్తా పత్రిక Ammenusastia కి లేఖ రాశాడు. పని ఆపుతున్నట్లు తెలిపేడు. ఆ పత్రిక ఈయన రాసిన లేఖను ప్రచురిస్తూ ముఖ్య వార్తగా రాసింది.
సోవియట్ అధికారులకు కూడా విషయం తెలిపేడు. వెంటనే అక్కడికి వచ్చిన సోవియట్ అధికారులను, బలగాలను ఎక్కువ కలవర పరిచింది(ఏడుపులు, కేకలు, అరుపుల కంటే) ఆ రాత్రి ఆ బోరు బావి నుండి తేజస్సు గల పొగ బయటకు రావడం, ఆ పొగ పక్షి ఆకారంగా మారి "నేను జయించేను" అని రష్యన్ భాషలో అరిచి మాయమవడం. అప్పుడు అక్కడున్న వారిలో చాలామంది స్ప్రుహ తప్పి పడిపోయారు. ఆంబులాన్స్ రావడం, అందరికీ జరిగింది మరిచిపోవడానికి ఒక ఇంజక్షన్ (ఈ ఇంజక్షన్ను సోవియట్ రష్యాలో షార్ట్ టెర్మ్ మెమొరీ తీసెయ్యడానికి ఇస్తారట) ఇవ్వడం జరిగిందని Mr. Nummedal అనే సోవియట్ అధికారి తెలిపేరు.
ఈ బోరు బావి గురించిన విషయాలున్న పత్రాలను అప్పటి సోవియట్ యూనియన్ నాశనం చేసింది. ఫిన్లాండ్ పత్రికను రూపురేఖలు లేకుండా చేసింది. Kola Super deep Borehole ప్రాజక్ట్ ను ఆపేశామని, బోరు బావిని మూసేశామని తెలిపేరు. మూసివేయడానికి కారణం తవ్వుతున్న చోట 356°F ఉష్ణోగ్రత ఉండటంతో, అక్కడ యంత్రాలు పనిచేయడం లేదని తెలిపేరు. వికీపీడియాలో కూడా ఇలాగే రాసుంటుంది.
కానీ ఇతర శాస్త్రవేత్తలు అడిగిన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పలేదు.

సెంటర్ ఆఫ్ ఎర్త్ లో మాత్రమే ఉష్ణోగ్రత 4000°C ఉంటుంది. భూమి ఉపరితలం నుండి సెంటర్ ఆఫ్ ఎర్త్ కు దూరం 6,378 కిలోమీటర్లు . మాల్టన్ రాక్ (Molten rock...... భూమి క్రింద ఉండే రాళ్ళ బురద ప్రదేశం) భూమి ఉపరితలం నుండి 3000 కిలోమీటర్ల లోతుకు వెడితేగానీ రాదు. అక్కడ దాక వెడితేనే 2000° C ఉష్ణోగ్రత ఉంటుంది. వీరు 15 కిలోమీటర్ల దూరం కూడా తవ్వలేదు. అప్పుడే అంత ఉష్ణోగ్రతా?... రష్యన్లు చెప్పేది నమ్మశక్యంగా లేదు అంటున్నారు.

వికీపీడియాలో ఏడుపులు, కేకలు, అరుపుల శబ్ధాలు వినబడటం మోసపూరితం అని రాసున్నా, ఈ బోరు బావి తవ్వేటప్పుడు శాస్త్రవేత్తలు వింత శబ్ధాలు విన్నారు అనేది రాసుంది.

బోరు బావిలో నుండి వినబడ్డ శబ్ధాలు....వీడియో

1997లో Trinity Broadcasting Network, ఫిన్లాండ్ న్యూస్ పేపర్ కు అందించిన బోరు బావి శబ్ధాలను "నరకానికి బోర్ దారి" అనే పేరుతో ప్రసారం చేయటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ శబ్ధాలను well to Hell అనే పేరుతో యూట్యూబ్ లో వినవచ్చు.

అధికార పూర్వకంగా విషయాలను ప్రభుత్వాలు తెలుపవు కనుక ఇది మిస్టరీ గానే మిగిలిపోయింది.

No comments:

Post a Comment