Thursday, September 8, 2016

నవ్వించే శిల్పాలు...ఫోటోలు మరియు వివరాలు

'నవ్వడం ఒక భోగం-నవ్వించడం యొక యోగం. నవ్వకపోవడం ఒక రోగం'' అన్నాడో మహాకవి.

దేశమేదైనా... భాష ఏదైనా... ప్రతి మనిషికీ అర్థమయ్యే భాష నవ్వు ఒక్కటే. ప్రతి నవ్వులోని అర్థం కూడా ఒక్కటే. నవ్వడానికి ఏ భాషా నేర్చుకోవాల్సిన పనిలేదు. ఉల్లాసపూరితమైన నవ్వు ఆరోగ్యంపై అద్భుతంగా ప్రభావం చూపుతుంది. మానసికంగా ఉల్లాసాన్ని కలిగించి బాధలను విచారాలను దూరం చేస్తుందని, వ్యాధుల నుండి నివారణ కలిగిస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
హాయిగా స్వేచ్ఛగా నవ్వడం ద్వారా రక్తపోటు, గుండెజబ్బులు, నరాల బలహీనతలాంటి శారీరక రుగ్మతలెన్నో నివారించబడతాయని, క్యాన్సర్ని సైతం జయించవచ్చని అంటున్నారు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధం.

ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం మారదు. నవ్వు శరీరంలోని కొటికోల్ అయాన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరంచేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్రను పోషిస్తాయి.
ఎక్కువగా నవ్వినప్పుడు సాధరణంగా కంటే ఎక్కువ ఆక్సిజన్ ను పీల్చుతాము. అందువల్ల, నవ్వడం వల్ల ఆక్సిజన్ తీసుకోవడం పెంచవచ్చు. ఇది హార్ట్ పంపింగ్ రేట్ ను పెంచుతుంది, అది శరీరంలో బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతుంది . కొన్ని పరిశోధనల ప్రకారం నవ్వు డయాబెటిక్ పేషంట్స్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుందని నిరూపించాయి. కాబట్టి, నవ్వడం వల్ల మనం ఖచ్చితంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు.
ఆధునిక జీవితం సంక్షుభితమైపోయింది. గొంతుకోత పోటీలు, ఉరుకుల పరుగుల జీవితంతో మనకు తెలియకుండానే అనేక వ్యాధులు చుట్టు ముడుతున్నాయి. కొత్త కొత్తగా పుట్టుకు వస్తున్న వ్యాధుల చికిత్సలకు కొత్త అధ్యయనాలు, మందులను ఆధునిక ఇంగ్లీషు వైద్యం కనిపెడుతోంది. కానీ అవి అనేకసార్లు అందరికీ అందుబాటులో ఉండడం లేదన్నది నగ్న సత్యం. అందుకే నేటి కాలంలో ప్రత్యామ్నాయ చికిత్సలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకూ మందుల అవసరం లేకుండానే ఈ చికిత్సల ద్వారా జీవన శైలిలో మార్పులు చేసుకుని వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని ఆయా చికిత్సలు చేసే వారు చెప్తున్నారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండానే వ్యాధులు రాకుండా, వచ్చిన వ్యాధుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉందంటున్న ప్రత్యామ్నాయ చికిత్సలు లేదా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాచుర్యం పొందుతున్నాయి.
1973లో రోమ్ విశ్వవిద్యాలయం వైద్య విభాగం వారు మొట్ట మొదటి ప్రపంచ ప్రత్యామ్నాయ వైద్య సదస్సును ( వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్) నిర్వహించింది. సదస్సు తాత్కాలిక కార్యక్రమంలో 135 పైచిలుకు చికిత్సా విధానాలను క్రోడీకరించారు. అన్నికాలాల్లో ప్రతి దేశంలో ఓ వైద్య శాస్త్రం , చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఈనాటికీ ప్రపంచ వ్యాప్తం గా 100కుపైగా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఆచరణలో వున్నాయి. అందులో ఒకటే లాఫింగ్ థెరపీ.
1964లో మొట్టమొదటిసారి నార్మన్ క్విజిన్స్ నవ్వును ఒక చికిత్సగా ప్రయోగించి చూశాడు. సానుకూల ఆలోచన, నవ్వు ప్రయోగించి అందరూ నయం కాదని భావిం చే కీళ్ళనొప్పుల వ్యాధిని నయం చేశారు. హాస్య చిత్రాలను చూడడం, విటమిన్ సి వాడడం అతడు ప్రయోగించిన పద్ధతిలో ప్రధాన అంశాలుగా వున్నాయి. 30 నిముషాలు హాస్య చిత్రాలు చూస్తే 2 గంటల పాటు నొప్పిలేని నిద్ర వస్తుందని అతడు కనుగొన్నాడు. ఆరు నెలల తరువాత క్విజిన్స్ వ్యాధి పూర్తిగా నయమైపోయింది.
1995లో డా.మదన్ కటారియా ఇండియాలో మొట్టమొదటి లాఫ్టర్ క్లబ్ ప్రారంభించాడు. లాఫ్టర్ యోగా.

2009 లో కెనడా దేశంలోని వాంకోవర్ నగరంలో పిచ్చిగా నవ్వే అతిపెద్ద 14 కంచు విగ్రహాలను సంస్థాపన చేసేరు. మొదట్లో ఈ విగ్రహాలను వాంకోవర్ నగరంలోని అంతర్జాతీయ ఎక్జిబిషన్ సెంటర్ ప్రాంగనంలో ఒక కళాత్మక చిహ్నంగా ఉండేందుకు ఏర్పాటు చేసేరు. చైనా దేశానికి చెందిన శిల్పకళా నిపుణుడైన Yue Minjun అనే కళాకారునిచే డిజైన్ చేయబడ్డాయి.
ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, నవ్వే జీవిత విజయాలకు ముఖ్యమైన మొదటి అడుగు, నవ్వే ప్రపంచ శాంతికి తీపి గుర్తు, నవ్వే మానవ ఆరొగ్యానికి అతిముఖ్యం అనే సందేశాలను అందించే విధంగా ఉండేందుకు ఏర్పాటుచేయబడ్డాయి.
ఒక్కొక్క విగ్రహము 8.5 అడుగుల ఎత్తు, 250 కిలోగ్రాముల బరువుతో, నవ్వు ముఖాలతో, నవ్వు కలిగించే ప్రత్యేక భంగిమలతో రూపొందించబడ్డాయి. ప్రారంభంలో 5 సంవత్సరాల వరకే ఈ విగ్రహాలు ఉంచబడతాయని ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఈ 5 సంవత్సరాలలో పర్యాటకులు, ఆ నగర ప్రజలు, ఆ దేశ ప్రజలు ఆ విగ్రహాలను చూడటానికి వచ్చి, ఆ విగ్రహాలు ఏ బంగిమలో ఉండి నవ్వుతున్నాయో, అదేలాగా వారు కూడా చేయడం, బిగ్గరగా నవ్వడం, వారిని చూసి వారితో వచ్చిన వారు కూడా నవ్వడంతో ఆ విగ్రహాలకు విలువ, ఆకర్శన పెరిగింది. ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయో వారు కూడా అదేలాగ నిలబడి ఫోటోలు తీసికోవడం, ఆనంద పడటం వారికి ఎక్కువ సంత్రుప్తిని ఇచ్చేయి.

అందువలన ఈ నవ్వించే విగ్రహాలను శాశ్వతంగా ఉంచేయాలని నిర్ణయించుకున్నారు.

No comments:

Post a Comment