Sunday, September 25, 2016

ఇంజనీరింగ్ వండర్: ఐదు అంతస్తుల వంతెన...ఫోటోలు మరియు వివరణ

స్పఘెట్టి జంక్షన్: ఇంగ్లాండ్
వంతెన వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడం. వంతెనలు ఎక్కువగా నదులు, రహదారి, లోయలు మొదలైన భౌతికమైన అడ్డంకుల్ని అధిగమించడానికి నిర్దేశించినవి. రహదార్లను ఎంత బ్రహ్మాండంగా నిర్మించినా అవి నదుల దగ్గర ఠపీమని ఆగిపోతే ప్రయోజనముండదు. రోడ్లు ఎంత ముఖ్యమో వంతెనలు కూడా అంతే అవసరం.

మధ్య యుగాల్లో వంతెన నిర్మాణాన్ని ధర్మకార్యంగా భావించేవారు.

కానీ నేడు అదొక సాంకేతిక, కళాత్మక కార్యంగానూ, మూల భూతమైన సామాజిక అవసరాన్ని తీర్చే సాధనంగానూ పరిణమించింది. వంతెన రూపు రేఖలు ఎలా ఉండాలో, ఏ పదార్థాలతో దాన్ని నిర్మించాలో నిర్ణయించే ముందు ఆ వంతెనను ఉపయోగించబోయే ప్రజల అవసరాల్ని ఇంజనీర్లు పరిగణించాల్సి ఉంటుంది. పైగా, అది చూడటానికి అందంగా కూడా ఉండాలి. అయితే ఈ అందాన్ని నిర్ణయించటానికి నిర్ణీత నియమాలంటూ ఏవీ లేవు.
ఇంతే కాకుండా వంతెనపై ఏ రకమైన రవాణా ఉంటుందో, ఎంత ఉంటుందో, ఓడలు, రైళ్ళు, ఇతర వాహనాలు వెళ్లటానికి వీలు కల్పించాలో లేదో - ఇలాంటి విషయాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. నిర్మాణ పదార్థాలు రాయి, ఇటుక, ఉక్కు, తేలిక లోహ మిశ్రమం లేదా కాంక్రీట్ ఉండవచ్చు. కడపటి మూడు పదార్థాలను, అందులోనూ విస్తృతంగా పరిశీలించి వంతెన నిర్మాణానికి పూనుకోవాలి. ఇలా చేసినప్పుడే అది సమర్థవంతంగానూ, చౌకగానూ , అందంగాను ఉంటుంది.

అలాంటి అందమైన వంతెనే ఇంగ్లాండ్ దేశంలో నిర్మించిన ఈ ఐదంతస్తుల స్పఘెట్టి జంక్షన్ వంతెన.
ఇంగ్లాండ్ దేశంలోని బ్రిమింగాం నగరములోని Gravelly Hill(Spaghetti Junction)ఇంటర్చేంజ్ రహదారి ఆ దేశ సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణాలలోనే దిగ్గజమైనది. ఎందుకంటే అత్యంత క్లిష్టమైన రూపకల్పనతో నిర్మించబడినది ఈ ఇంటర్చేంజ్ రహదారి.

క్లుప్తంగా చెప్పాలంటే 30 ఎకరాల స్థలంలో రెండు కాలువలు, రెండు నదులు, రెండు రైల్వే లైన్లపై 18 రహదారులు కట్టేరు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన రహదారుల నెట్వర్క్ గా పేరు సంపాదించింది ఈ ఇంటర్చేంజ్ రహదారి.
గత ఏడాది: అంటే 2015 మే 24 న తన 43 వ పుట్టిన రోజును జరుపుకుంది. సరిగ్గా 43 సంవత్సరాల క్రితం 1972 మే 24 న రవాణా సౌకర్యానికి తెరువబడింది. 1968 లో నిర్మాణం ప్రారంభించబడి 4 సంవత్సరాలలో నిర్మాణం పూర్తిచేయబడింది. ఆ రోజుల్లో అంత వేగంగా కట్టబడిన 5 అంతస్తుల వంతెన ఇదొక్కటే. ఈ ఐదంతస్తుల వంతెనను 500 కాంక్రీట్ స్తంభాల సహాయంతో నిర్మించగా, అప్పట్లో రోజుకు 40,000 వాహనాలు ఈ వంతెనలను వాడుకుని వెళ్ళేవి. అదే ఈ రోజున ఈ ఇంటర్చేంజ్ వంతెన మీద రోజుకు 2,10,000 వాహనాలు వెడుతున్నాయి.
ఒక్కొక్క కాంక్రీట్ స్తంభం ఎత్తు 80 అడుగులు. రహదారులలోనే అత్యంత పెద్ద రహదారి పొడవు 21.7 కిలోమీటర్లు. 18 వేరు వేరు మార్గములను కలిపే ఈ ఐదంతస్తుల వంతెనను పూర్తిగా చుట్టి రావాలంటే 73 మైళ్ళ దూరం పయనించాలి. ఈ ఇంటర్చేంజ్ రహదారి కూడలి ఎంత ముఖ్యమైనదంటే సోవియట్ యూనియన్ తో ప్రచ్ఛన్న యుద్ధం జరిగే రోజుల్లో న్యూక్లియర్ బాంబు వేసే లక్ష్యములలోఇదొక చోటు.

40 వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా వంతెనను పరీక్షించిన ఇంజనీర్లు, ఈ వంతెన ఇంకొక 100 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులను ఇవ్వదని హామీ ఇచ్చేరు.
13,000 టన్నుల ఉక్కుతో నిర్మించబడ్డ ఈ ఐదంతస్తుల వంతెన నిర్మాణానికి 1,75,000 క్యూబిక్ గజాల కాంక్రీట్ ఉపయోగించేరు.

ఈ ఐదంతస్తుల వంతెనలో మొత్తం 46 చోట్ల సిగ్నల్ దీపాలు, 3 ఎలెక్ట్రానిక్ మెసేజ్ బోర్డులు, 25 అత్యవసర టెలిఫోన్ బూత్స్ ఏర్పాటు చేసేరు.

వంతెన కోసం ప్రత్యేకంగా ఒక వాతావరణ మానిటర్ కేంద్రం అమర్చేరు.

ఈ ఐదంతస్తుల వంతెనను కట్టడానికి అయిన మొత్తం ఖర్చు 10 మిల్లియన్ పౌండ్లు. వంతెన సంరక్షణ కొరకు సంవత్సరానికి 7 మిల్లియన్ పౌండ్లు నిలువ నిధిగా ఉంచేరు.

ప్రతి రోజూ ఇంజనీర్లు వంతెనను పర్యవేక్షణ చేస్తూ అవసరమైన చోట చిన్న చిన్న మరమత్తులు చేస్తూ ఉంటారు.

ఈ వంతెనను నిర్మించడానికి ఆ ప్రాంతములోని ఎన్నో ప్రైవేట్ ఆస్తులను కొనుకున్నారు. 160 ఇళ్ళు, ఒక ఫ్యాక్టరీ, ఒక బ్యాంకు, ఒక పెద్ద హోటల్, ఒక పెట్రోల్ బంకు 3 మంచి నీటి సరఫరా కేంద్రాలను కొనుక్కుని వారందరికీ అక్కడే వేరే ఏర్పాట్లు చేసి ఇచ్చేరు.

ఇప్పటికీ ఈ ఐదంతస్తుల వంతెనను చూడటానికి విదేశాల నుండి పర్యాటకులు వస్తారట.

1 comment:


 1. అయిదంతస్తుల వంతెన
  నయగారంబులొలికించె నవ్యపు రీతిన్ !
  హొయలన సోయగము లనగ
  పయిదలి నడుమందమువలె పరిపరి రీతీ !

  జిలేబి

  ReplyDelete