Friday, September 9, 2016

రాళ్ళ పుస్తక ఆలయం: "కోరుకునేవన్నీ వరాలుగా ఇచ్చే ఆలయం"...ఫోటోలు మరియు వివరాలు

శాసనం(Epigraphy లేదా inscription) అంటే పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంధాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే శాసనం అనేవారు.
ఆ తరువాత శిలా శాసనాలు తగ్గిపోయి లోహ శాసనాలు ప్రాధాన్యత వహించేయి. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాల కన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటికి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ, చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహశాలనాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ శాసనాలను ప్రజలు ఏవో యంత్రాలుగానూ, మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిలో వ్రాసి వున్నాయని భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రాలేదు. వీటిలో నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యమిందులో వ్రాసివుందని పలువురు భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకోవడంతో ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్రశాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రిక సమాచారం నశించిపోయింది.
మాండలే ఒక బర్మా పట్టణము. ఇది రంగూన్ తర్వాత బర్మాలో రెండవ పెద్ద పట్టణము. మాండలే పర్వతం బర్మా దేశ ఈశాన్య దిశలో 240 మీటర్ల వైశాల్యం కలిగిన పర్వతం. ఈ పర్వతం పేరు వలనే ఆ పట్టణానికి మాండలే పట్టణం అని పేరు వచ్చింది. ఈ మాండలే పర్వతం అనేక ఆలయాలకు, మఠాలకు నిలయం. బర్మా దేశంలోని బౌద్ద మతస్తులకు ఇది ఒక పుణ్యక్షేత్రం. పర్వత శిఖరంపైన ఉన్న ఆలయం "కోరుకునేవన్నీ వరాలుగా ఇచ్చే ఆలయం" అని ప్రసిద్ది చెందింది.
1857లో బర్మాను పరిపాలిస్తున్న రాజు మిన్ డాన్ మిన్ శాంతి కామకుడు, అహింసావేత్త. బుద్దుని భోదనలు తరతరాలకు నిలిచిపోవాలని, భావితరములకు కోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించుకున్నడు. బుద్దుని భోదనలను లోహ శాసనాలపై రాయించి బద్రపరిచినా అవి నశించిపోతాయని గ్రహించి, వాటిని రాళ్ళమీదే రాయించాలని నిర్ణయించుకుని, భారీ రాతి దిమ్మలపై రాయించి బద్రపరచాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలోనే బర్మాపై బ్రిటీష్ సేనల దండయాత్ర మొదలయ్యింది.
దండయాత్రలో తాను ఓడిపోయినా బుద్దుని భోదనలతో ఉండే భారీ రాతి దిమ్మలకు ఎటువంటి హానీ జరగకూడదనుకుని తన పని మొదలు పెట్టేడు.
ఒక మీటర్ పొడుగు, ఒకటిన్నర మీటర్ వెడల్పు, 13 సెంటీమీటర్ల మందం ఉన్న పాలరాయి దిమ్మెలను తెప్పించేడు. వాటి మీద బుద్దుని భోదనలను చెక్కించేడు. బుద్దుని భోదనలు 729 పాలరాతి దిమ్మెలపై చెక్కేరు. ఒక పాలరాతి దిమ్మెపై మిగిలిన 729 రాళ్ళు ఎలా ఉనికిలోకి వచ్చినై అనే విషయాన్ని తెలియజేసే సమాచారమును చెక్కించేడు. అలా మొత్తం 730 రాతి పుస్తకాలు తయారైనాయి.
1860లో రాతి పుస్తాకాలు రాయడం మొదలుపెట్టేరు. దీని కోసం తన రాజభవనం దగ్గరే ఒక అతిపెద్ద షెడ్ వేయించేడు. అంతకు ముందు తాళపత్రాలలో ఉన్నటువంటి బుద్దుని భోదనల మూలమును సీనియర్ మఠాధిపతులు, అధికారులు శ్రద్ధగా, క్షుణ్ణంగా పరీశీలించిన పిమ్మట ఒక లేఖరి జాగ్రత్తగా కాపీ చేసి ఒక శిల్పికి అందించేడు. ఆ శిల్పి బుద్దుని భోదనలను పాలరాతి మీద చెక్కడం జరిగింది. ఒక్కొక్క రాతి మీద 80 నుండి 100 పంక్తుల చొప్పున రాతికి ఇరువైపులా బర్మా లిపితో చెక్కబడింది. పంక్తులను బంగారు రేకుతో నింపేడు.
ఒక్కొక్క పాలరాతి పుస్తక దిమ్మెకు ఒక గుడి కట్టించి, అందులో వాటిని ఉంచేడు. 1860 లో ఈ గుడులను కట్టడం మొదలుపెట్టేరు. గుడి గోపురాలను 1862లో ముగించేరు. 1868 మే నెల నుండి పర్యాటకులను అనుమతించేరు. ఈ గుడులను 3 వరుసలుగా కట్టేరు. మొదటి వరుసలో 42 గుడులు, రెండవ వరుసలో 168 గుడులు, మూడవ వరుసలో 519 గుడులు నిర్మించేరు. వీటికి దక్షిణ దిసలో ఒకటి కట్టి అందులో ఈ గుడి సమాచారమును చెక్కిన పాలరాతి దిమ్మెను ఉంచేరు. దీనితో ఆ ఆలయంలో మొత్తం 730 గుడులైనాయి. ఒక్కొక్క గుడి మీద బంగారు, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఉంచేరు.
1885లో బ్రిటీష్ సేనలు బర్మాపై దాడిచేసి ఈ చోటుని కూడా ఆక్రమించేరు. బౌద్దమత మఠాది పతులను కూడా అనుమతించలేదు. అప్పుడు బ్రిటీష్ ను పరిపాలిస్తున్న విక్టోరియా మహారాణి అన్ని మతాలను గౌరవించాలని, వారి ఆలయాలకు, మఠాలకు ఎటువంటి నష్టం జరగకూడదనే గట్టి శాశనం బ్రిటీష్ సేనాధికారులకు ఇచ్చిందని తెలుసుకున్న బర్మా బౌద్ద మఠాధిపతులు విక్టోరియా మహారాణికి ఈ ఆలయాన్ని వారి సేనలు ఆక్రమించేయని తెలీజేసేరు. వెంటనే ఆ ఆలయం నుండి సేనలను తిరిగి రమ్మని ఆమె శాశించింది. కానీ అప్పటికే ఆలయంలోని గుడులమీద ఉన్న విలువైన వస్తువులను వారు అపహరించేరు. పాలరాతి దిమ్మెలను పగులగొట్టలేకపోయేరు. మహారాణి ఆజ్ఞమేరకు బ్రిటీష్ సేనలు ఆ ఆలయాన్ని వదిలిపెట్టి వచ్చేరు.
1913 లో నాశనం చేయబడ్డ ఈ ఆలాయాన్ని సరిచేసేరు. 2013 లో యూనెస్కోవారు ఈ ఆలయాన్నీ, ఆలయంలో ఉన్న పాలరాతి దిమ్మెలలోని భొధనలను ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకముగా గుర్తించేరు.

No comments:

Post a Comment