Monday, August 15, 2016

ఉత్కంఠభరిత సింహిక ఖగోళవేధశాల....ఫోటోలు మరియు వివరాలు

ఖగోళ వేధశాల లేదా వేధశాల...ఖగోళాన్నీ, అంతరిక్షాన్నీ, వాటిలో వుండే వస్తువులనూ, శరీరాలనూ, శాస్తాలనూ, వింతలనూ తిలకించడానికీ, శోధించడానికి ఉపయోగపడే కేంద్రం.
ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, సముద్ర శాస్త్రము, అగ్నిపర్వత శాస్త్రము, వాతావరణ శాస్త్రము మొదలగువాటిని శోధించుటకునూ ఈ ఖగోళ వేధశాలలు ఉపయోగపడతాయి. చారిత్రకంగా ఇవి, సౌరమండలము (సౌరకుటుంబము), అంతరిక్ష శాస్త్రము, ఖగోళ శాస్త్రము, గ్రహాలను, నక్షత్రాలను శోధించడం, వాటి గమనాలను పరిశీలించడం, వాటిమధ్య దూరాలను తెలుసుకోవడం కొరకు ఏర్పాటుచేయబడిన కేంద్రాలు. ఖగోళ వేధశాలలనే అంతరిక్షవేధశాలలని కూడా అంటారు.
ఖగోళ వేధశాలల్లో అనేక టెలిస్కోపులు మరియు ఇంకా ఇతర పరికరాలు ఉంటాయి. వీటి ద్వారా శాస్త్రవేత్తలు సమర్థంగా తమ పరిశోధనలను కొనసాగిస్తారు. ఈ ఖగోళ వేధశాలలు ఎత్తైన కొండల మీద, జనావాసాలకు దూరంగా ఉంటాయి. వాటి నుండి అన్ని విషయాలు సమర్థంగా తెలుసుకొని విపత్తులు ఏమైనా ఉంటే ముందే తెలియజేస్తారు. ప్రతి విషయాన్ని క్లుప్తంగా పరిశీలించి మనకి వివరిస్తారు. మున్ మున్ముందు జరిగే విషయాలు తెలుసుకోవడం ద్వారా మనం జాగ్రత్త పడవచ్చు. ఇవన్ని తెలపాలంటే ఎన్నో పరికరాలు అవసరం. అందులో కాలుష్యంతో కూడినవి కొన్ని ఉంటాయి. అందుకే సాధారణంగా వీటిని కాలుష్యం తక్కువగా ఉండి, ప్రకాశవంతమైన వెలుతురుతో నిండి ఉండే నగరాలకు దూరంగానే నిర్మిస్తారు.
ఖగోళ వేదశాలలను ఎత్తైన పర్వత భాగాలమీదే ఎందుకు నిర్మిస్తారో మీకు తెలుసా? ఎందుకంటే భూవాతావరణంతో కలిసిపోక ముందే నక్షత్రకాంతిని పర్వతాగ్రాలమీద ఉండే వేధశాలలు సేకరిస్తాయి గనుక పరిశోధనా ఫలితాలు నిర్దిష్టంగా ఉంటాయి. భూవాతావరణం కారణంగా కలుషితమైన నక్షత్రకాంతి సమర్థ పరిశోధనలకు వీలివ్వదు. భూ వాతావరణం కాలుష్యాల బారిన పడకముందే ఖగోళ వస్తువుల కాంతిని పర్వత ప్రాంతాలనుంచి శాస్త్రజ్ఞులు గమనిస్తారు. కాబట్టి వారి అంచనాలు ఖచ్చిత ప్రమాణాలతో ఉండటానికి అవకాశముంది.
ఈ ఉత్కంఠభరిత సింహిక ఖగోళవేధశాల స్విట్జర్లాండ్ దేశంలోని ఝుంగ్ఫ్రౌజొచ్(Jungfraujoch) అనే చోట పర్వత శిఖరం పైన ఉన్నది. ఆ పర్వతం పేరు సింహిక. అందుకే ఈ ఖగోళవేధశాలకు సింహిక ఖగోళవేధశాల అని పేరు పెట్టేరు.
దీన్ని ఎందుకు ఉత్కంఠభరితమైనదని చెబుతున్నారంటే ఈ ఖగోళవేధశాల స్విట్జర్లాండ్లోనే రెండవ ఎత్తైన అబ్జర్వేషన్ డెక్ (పర్వత టాప్) పైన నిర్మించబడింది. సముద్ర మట్టానికి 3,571 మీటర్ల ఎత్తులో, పర్వత శిఖర చివరిలో ఇంజనీరింగ్ ప్రతిభనంతా కూడగట్టుకుని కట్టేరు. మొదట్లో ఈ ఖగోళవేధశాలను మొదటి ఎత్తైన అబ్జర్వేషన్ డెక్ (పర్వత టాప్) పైన నిర్మించాలని అనుకున్నారు. కానీ అది ప్రజలకు అందుబాటులో ఉండదని గ్రహించి రెండవ ఎత్తైన అబ్జర్వేషన్ డెక్ (పర్వత టాప్) పైన నిర్మించేరు.
ఈ పర్వత శిఖరం ప్రత్యేక స్థానాన్నికలిగి యున్నది. ఇక్కడ వాతావరణం కాలుష్యమవడానికి అవకాశం లేదు అనేది ఒక ప్రత్యేక స్థితి అయితే, ఝుంగ్ఫ్రౌజొచ్ రైల్వే స్టేషన్ ఈ శిఖరానికి దగ్గరగా ఉండటం, అధ్భుతమైన మౌలికసదుపాయాలు కలిగియుండటం మరొక ప్రత్యేక స్థితి. అందువలన సంవత్సరం పొడవునా ఈ ఖగోళవేధశాలకు వెళ్ళివచ్చే సౌకర్యం కలదు.
1912 లో పర్వతంపై ఝుంగ్ఫ్రౌజొచ్ అనే చోట ఒక రైల్వే స్టేషన్ నిర్మించేరు(యూరప్ ఖండంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉండే రైల్వేస్టేషన్ ఇదొక్కటే). అప్పట్లోనే ఈ చోటు పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు అనువుగా ఉండేది. కానీ అప్పట్లో శాస్త్రవేత్తలు కఠినమైన పరిస్థితులలో పనిచేస్తూ. తాత్కాలిక ఆశ్రయాలను నిర్మించుకుని నివసించేరు. పరిశోధనలను తీవ్రం చేయాలనే ప్రసక్తి వచ్చినప్పుడు 1937 లో ఆసక్తి చూపిన శాస్త్రవేత్తలకోసం ఈ సింహిక ఖగోళవేధశాల నిర్మించబడింది.
ఈ సింహిక ఖగోళవేధశాల నిటారుగా ఉండే కొండ శిఖర భాగంలో నిర్మించబడింది. కొండ శిఖర భాగం నుండి(ఖగోళవేధశాల)సొరంగం త్రవ్వబడింది.ఝుంగ్ఫ్రౌజొచ్ రైల్వే స్టేషన్ నుండి సొరంగం గుండా వెళ్ళి, అక్కడున్న ఎలివేటర్ మూలంగా ఖగోళవేధశాలను చేరుకోవాలి. ఖగోళవేధశాల యొక్క మధ్య ప్రాంతమును శాస్త్రవేత్తలు మాత్రమే వాడుకుంటారు. ఖగోళవేధశాల చుట్టూ తుప్పు పట్టని ఇనుప చప్పరము అమర్చేరు. ఇక్కడ పర్యాటకులను అనుమతిస్తారు. పర్యాటకులు ఇక్కడ నుండి 360 డిగ్రీల వీక్షణముతో హిమానీనదమును తిలకించవచ్చు. అలాగే 11,333 అడుగుల లోతైన పచ్చటి అగాధం చూడవచ్చు.
ఈ ఖగోళవేధశాలలో పెద్ద టెలస్కోపులు కలిగిన నాలుగు పరిశోధనా కేంద్రాలు, విశ్వం నుండి వచ్చే కాంతిని పరీక్షించే భవనము, ఒక లైబ్రరీ, ఒక వంట గది, ఒక పెద్ద లివింగ్ రూము, పది బెడ్ రూములు, ఒక పెద్ద బాత్ రూము మరియూ ఖగోళవేధశాలను భద్రంగా చూసుకునే సాంకేతిక నిపుణుల కోసం నివాస గదులు ఉన్నాయి. ఖగోళ వేధశాలలో, శాస్త్రవేత్తలను మాత్రమే ఉండటానికి అనుమతిస్తారు. పర్యాటకులు ప్రొద్దున వచ్చి, రాత్రిలోపు తిరిగి వెళ్ళిపోవాలి. పరిశోధనా కేంద్రంలోపలికి వెళ్ళటానికి పర్యాటకులకు అనుమతిలేదు.

1 comment: