Saturday, August 27, 2016

మనమంతా కూడా వాతావరణ శరణార్థుల లిస్ట్ లోకి వెడతామా?.....ఫోటోలు మరియు వివరాలు

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా 40 శాతం జనాభాకు నీటి కొరత ఎదురుకానుందని జర్మనీ కి చెందిన అంతర్జాతీయ వాతావరణ అధ్యయన సంస్థ వెల్లడించింది.

రోజురోజుకు పెరుగుతున్న భూతాపం వల్ల నీటిలభ్యత తగ్గి రానున్న రోజులలో ఈ సమస్య మరింత తీవ్రం కానుందని ఈ నివేదిక తెల్పింది. ఇప్పటి పరిస్థితులకు మరో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ప్రజలు నీటి కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఒక వ్యక్తికి ఒక సంవత్సర అవసరాలకు కావలసిన 1200 క్యూబిక్ మీటర్ల నీటి లభ్యత, ప్రస్తుత వాతావరణ పరిస్తితులు ఇలాగే కొనసాగితే మరో దశాబ్దంలో సంవత్సరానికి తలసరి నీటి లభ్యత 500 క్యూబిక్ మీటర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక హెచ్చరించింది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు భూతాపం వల్ల రానున్న భవిష్యత్తులో మానవాళి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మార్చి30, 2014న విడుదలైన యునైటెడ్ నేషన్స్ నివేదిక పేర్కొంది.

వాతావరణ మార్పులతో పోలార్ ఐస్ కేప్ ప్రాంతాలు మరియు గ్లేసియర్లు కరిగి సముద్రమట్టం పెరిగి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలు, మహాసముద్రాలలోని జంతుజాలం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనున్నాయి.
మంచినీటి సరస్సులు మరియు సముద్రాలలోని నీరు అమ్లమయమై, అందులోని జంతువులకు ఆ నీరు విషతుల్యం కానుంది.

భూతాపం వల్ల సముద్రనీటిమట్టం పెరిగిందని ఈ నివేదిక వివరించింది. భూతాపం యొక్క ప్రభావాలు, వాతావరణంలోని మార్పు, పర్యావరణ మరియు మానవజీవితాలతో సంబంధం కలిగి ఉంది.
వాతావరణంలోని మార్పులలో ఉష్ణోగ్రత నమోదు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, మరియు ఉత్తరార్ధ గోళంలో తగ్గిన మంచుపొరలు అన్నీ వాతావరణంలోని కనిపించే మార్పులకి నిదర్శనాలు.

మంచు దేశం సైబీరియాలో మరోసారి వింత ఘటనలు చోటుచేసుకున్నాయి. సైబీరియాలో వందల అడుగుల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలు కంగారుపుట్టిస్తున్నాయి. భూమిపై వరసగా రెండు లోతైన అగాధాలు ఏర్పడ్డాయి. గత వారం 160 అడుగుల వెడల్పుతో 230 అడుగుల లోతున భూమిపై ఓ భారీ రంధ్రం ఏర్పడింది. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తుండగానే మరోవైపు సమీపంలో మరో అగాధం కలవరపెట్టింది. మొదటిదానితో పోల్చితే ఆస్థాయిలో లేకపోయినా కొద్ది రోజుల తేడాతో ఇలా రెండు ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు

10వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఓ సముద్రముండేది. ఉప్పు, గ్యాస్, ఇసుకల మిశ్రమం ఉండేది. కాలక్రమంలో ఇక్కడున్న నీళ్లు గడ్డకట్టినట్టు నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో మార్పులతో ఐస్ కరిగి అడుగుభాగంలో ఉన్న గ్యాస్ బలంగా తన్నుకురావడంతో ఇలాంటి అగాధాలు ఏర్పడినట్టు సబ్ ఆర్టిక్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ అంచనా వేస్తోంది. షాంపేన్ బాటల్ మూతను ఫోర్స్ గా తీస్తే ఎలా ఉబికి వస్తుందో అలాగే ఇక్కడ కూడా అదే తరహా ప్రక్రియ జరిగి ఉండొచ్చని ఉదాహరిస్తున్నారు. అదే నిజమైతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు తప్పవంటున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న వేడి కారణంగా ఇలాంటి ఘటనలు తరచుగా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని నేషనల్ స్నో అండ్ డేటా సెంటర్ అంటోంది. అయితే ఈ ప్రాంతంలో ఆయిల్ వెలికితీసే కంపెనీల పని కూడా కావొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అవసరమైతే డ్రిల్లింగ్ చేస్తారు తప్ప ఇంతపెద్ద గొయ్యిలను తవ్వాల్సిన అవసరముండదంటున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులే వీటికి కారణమని ఎక్కువమంది భావిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కొందరైతే ఈ అగాధాల్లోకి ఎలియన్స్ దిగారని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే త్వరలోనే దీనిపై సమాచారం తెలిసే అవకాశముంది.
భారత్ పై తీవ్ర దుష్ప్రభావం:

వాతావరణ మార్పు, రుతుపవనాల వైఫల్యం పురాతన హరప్పా (సింధు) నాగరికత అంతానికి దారితీసినట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించడం సంచలనం సృష్టించింది. 5200 ఏళ్ల క్రితం సింధునది నుంచి అరేబియా సముద్రం మొదలుకుని గంగా మైదానం దాకా దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విలసిల్లిన మహా నాగరికత అది. ఆనాటి ప్రజలు వ్యవసాయ కార్యకలాపాల కోసం నదీజలాల మీదే ఆధారపడ్డారు. రుతుపవనాలు దారిమళ్లి తూర్పు దిశలో సాగిపోవడంతో నదులు ఇంకిపోయాయని, 3900 ఏళ్లనుంచి 3000 ఏళ్లక్రితం ఆ నాగరికత క్రమేపీ క్షీణించి కనుమరుగైందన్నది వారి అధ్యయన సారాంశం. మానవేతిహాసంలోనే మహోజ్జ్వల ఘట్టంగా విలసిల్లిన సింధు నాగరికత ఉత్థానపతనాలకు కారకాలు జలవనరులే. వాతావరణ మార్పు నాటినుంచి నేటి దాకా మనిషి నెత్తిమీద కత్తిలా వేలాడుతూనే ఉంది!
వాతావరణ మార్పు వల్ల రానున్న 30 ఏళ్లలో అత్యధిక ముప్పు ఎదుర్కొనే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని బ్రిటన్కు చెందిన మాప్లెక్రాఫ్ట్ సంస్థ తమ సర్వేలో వెల్లడించింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, నేపాల్ నాలుగు, పాకిస్థాన్ 16, అఫ్గానిస్థాన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. 170 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో.. ఆసియా ప్రాంతంలోనే వాతావరణం అత్యంత దుర్భరంగా ఉన్నట్లు గుర్తించారు. జనాభా పెరుగుదల వల్ల వరదలు, తుఫాన్లు, అనావృష్టి ఏర్పడుతాయని తెలిపింది. వాతావరణంలో జరిగే స్వల్ప మార్పులు.. మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పర్యావరణ పరిశోధకుడు అన్నామొస్ తెలిపారు. నీటి వసతులు, పంట దిగుబడిపై దుష్ప్రభావం చూపడంతో పాటు సముద్ర మట్టాలు పెరిగి భూభాగాన్ని కోల్పొతామని వివరించారు.
మానవులచే కాలుష్యం చేయబడిన వాతావరణం భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రధాన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం మనమంతా విపత్తు కలిగించే, పెరుగుతున్న ఊష్ణోగ్రతకు దగ్గరలో ఉన్నాము. దీనివలన(పెరుగుతున్న ఊష్ణోగ్రత) పలుదేశాలు నీటమునిగే ప్రమాదం ఉన్నది. లక్షల మంది ప్రజలు స్థానభ్రంశము అవుతారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే స్థానభ్రంశమైన ప్రజలు ఎక్కడికి వెడతారు?

రానున్న 50 సంవత్సరాలలో మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్ ఉనికి లేకుండా పోవటం నిజమైన అవకాశం. ఆ దేశంలో నివసిస్తున్న 30 మిల్లియన్ ప్రజలు స్థానభ్రంశమౌతారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం వారందరినీ కాపాడగలదా? కాపాడలేదు. మరైతే వారందరూ ఎక్కడికి వలస వెడతారు...పక్కనున్న భారతదేశంలోకే. కానీ భారతదేశం, బంగ్లాదేశ్ ప్రజలను రానివ్వకుండా ఉండేందుకు ఇప్పటికే సరిహద్దంతా రేజర్ వైర్ కంచే వేసే పనిలో ఉన్నారు. మరైతే ఆ దేశ ప్రజలు ఎక్కడకి వెడతారు. చైనాలోకా? ......మనకు తెలియదు.
ఇది కేవలం ఆసియాలో ఒక మూలలో జరిగేది మాత్రమే...కానీ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా 150 మిల్లియన్ ప్రజల నుండి ఒక బిల్లియన్ ప్రజలదాకా స్థానభ్రంశమై వాతావరణ శరణార్థులుగా అయిపోతారని సూచిస్తోంది. ఒక్క సారిగా ఇంతమంది వాతావరణ శరణార్థులుగా మారటం అనేది జీర్ణించుకోలేని ఒక విషయం.

No comments:

Post a Comment