Wednesday, August 3, 2016

మిస్టరీ: బొమ్మ కాదు....చనిపోయిన మనిషే...!?...ఫోటోలు మరియు వివరాలు

మెక్సికో నగరంలోని ఒక బట్టల కొట్లోని బొమ్మ, బొమ్మ కాదట. ఆ బట్టల కొట్టు మాజీ యజమానురాలు కూతురు యొక్క శవం అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. మెక్సికో దేశములోని చీహుహా అనే నగరంలో “లా పాపులర్” అనే పేరుతో వివాహమునకు సంబంధించిన బట్టలు అమ్మే ఒక షాపు ఉన్నది. ఆ షాపులో చాలా బొమ్మలు ఉన్నాయి గానీ "లా పాస్కౌలిత" (La Pascualita ) అనే పేరున్న ఒక బొమ్మ (షాపులోని మరేబొమ్మకూ పేరు లేదు) మాత్రం బొమ్మ కాదని, చనిపోయిన ఆ షాపు మాజీ యజమానురాలు కూతురు యొక్క భద్రపరచబడిన (శవము కుళ్ళిపోకుండా) శవం అని చెబుతున్నారు. లా పాస్కౌలిత అనే ఈ బొమ్మ ఆ బట్టల కొట్లో గత 80 సంవత్సరములుగా చెక్కుచెదరకుండా ఉన్నదట.
గత కొద్ది సంవత్సరాల నుండి ఈ బొమ్మ పర్యాటకులను ఆకర్షిస్తోంది. నార్త్ అమెరికా, అమెరికా మరియు యూరప్ ల నుండి శవ పెళ్ళికూతురును చూడటానికి కొన్ని వేల మంది వస్తున్నారట. చూసిన వారందరూ బొమ్మ యొక్క తదేకమైన, మంత్రముగ్దుల్ని చేసే చూపులు మరియు వాస్తవికంగా కనిపించే లక్షణాలు చూసి అది బొమ్మ కాదని గట్టి నమ్మకంతో వెడుతున్నారట.
మార్చ్-25, 1930 లో లా పాస్కౌలిత అనే ఈ బొమ్మను పెళ్ళి కూతురు అలంకరణాలతో అలంకరించి కొట్లోని గాజు అద్దాల కిటికీ దగ్గర నిలబెట్టేరు. ఈ షాపు వైపుగా వెళ్ళే ప్రతిఒక్కరూ తమ దృష్టిని ఈ బొమ్మపై పెట్టకుండా వెళ్ళలేరు. ఎందుకంటే ఆ బొమ్మ కళ్ళు, జుట్టు, ఎర్రపారిన చర్మ పొర, అందం ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఆ బొమ్మ ఆ షాపు యజమానురాలు పాస్కౌలా ఎస్పర్జా పోలికలు కలిగి ఉన్నదని వెంటనే గ్రహించేరు. ప్రజల ఆలోచనలు ఒక ముగింపుకు వచ్చేయి. ఆ బొమ్మ, బొమ్మ కాదని, చనిపోయిన ఆ షాపు యజమానురాలు కూతురు యొక్క శవం అని ఒక నిర్ణయానికి వచ్చేరు.
ఆ షాపు మాజీ యజమాని కూతురు ఆ మధ్యే, అందులోనూ తన పెళ్ళి రోజున తేలు కాటు వలన చనిపోయింది. కూతురు మీద ప్రేమను చంపుకోలేక యజమానురాలు పాస్కౌలా తన కూతురు శవమును కుళ్ళిపోకుండా భద్రపరచి, తన షాపులోనే ఒక బొమ్మగా ఉంచిందని కొంతమంది స్థానికులు చెప్పడం మొదలు పెట్టేరు. ఈ విషయం మీద షాపు యజమానురాలు మరియు ఆమె తల్లి ఒక ప్రకటన చేసే లోపే ఆ బొమ్మకు “లా పాస్కౌలిత” అని అక్కడి ప్రజలు పేరు పెట్టేసేరు. మెక్సికో భాషలో లా పాస్కౌలిత అంటే “ఆమె కూతురు” అని అర్ధం.
శవం ఉనికిని ఊహించారు కాబట్టి సహజంగా దానికి అతీంద్రియ శక్తి ఉన్నదని ప్రచారం జరిగింది. ఆ బొమ్మ గురించిన అసాధారణ సంఘటనలు జరిగినట్లు తెలిపేరు. కానీ ఎవరూ ఈ సంఘటనలను ధ్రువీకరించలేదు. ప్రేమ విఫలమైన ఒక ఫ్రాన్స్ దేశ మాంత్రికుడు రాత్రి పూట ఈ బొమ్మ దగ్గరకు వచ్చి, తన మంత్ర జాలముతో ఆ బొమ్మకు ప్రాణం తెప్పించి, ఆమెతో నగరమంతా తిరుగుతాడట. కొంత మంది ఆ బొమ్మ చూపులు మారుతున్నాయని, షాపులో తమని వెంబడిస్తోందని చెబుతున్నారు. మరి కొందరు రాత్రి పూట ఆ బొమ్మ షో రూం కిటికీలో తన స్థానం మార్చుకుంటోందని చెబుతున్నారు.
ఈ కధలన్నీ భయపెట్టేవిగానే ఉన్నాయి, ముఖ్యంగా ఆ షాపులో పనిచేసేవారికి. అందులోనూ అత్యంత ముఖ్యంగా సోనియా బర్షియాగా అనే ఉద్యోగికి. ఎందుకంటే 15 రోజులకు ఒక సారి ఆమె ఈ బొమ్మ పై ఉన్న దుస్తులను తెర చాటున మారుస్తుంది. “దుస్తులు మార్చడానికి ఆ బొమ్మ దగ్గరకు నేను వెళ్ళినప్పుడల్లా నా చేతులు చెమటతో తడిసిపోతాయి. ఎందుకంటే ఆ బొమ్మ చేతులు మామూలు మనిషి చేతులులాగానే ఉంటాయి. ఆ బొమ్మ కాళ్ళ మీద వెరికోసా నరాలు కనబడతాయి. ఆమె బొమ్మ కాదు, నిజమైన మనిషి అని నేను నమ్ముతున్నాను" అని ఆ ఉద్యోగి చెబుతోంది.
ఈ ఉద్యోగి చెప్పిన మాటలు విన్న తరువాత అది బొమ్మ కాదు, శవం అని నమ్మకం కలుగుతోంది.
ఆ బొమ్మకి ఇప్పుడు 75 సంవత్సరాలన్నమాట. బొమ్మకున్న ఈ నగర సంబంధ కధను తీసిపారేయలేము. ఆమెను గౌరవించే విధంగా మెక్సికో దేశంలో జరుపుకునే డెడ్ పండుగ నాడు ఆ బొమ్మ దగ్గర పువ్వులు ఉంచుతారు. అక్కడి స్థానిక స్కూల్ పిల్లలు ఆ రోజున ఆ బొమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఆత్మ శాంతించాలని పువ్వుల తో ప్రార్ధన చేస్తారు. అంతేకాక, ఈ బొమ్మకు మాత్రం దుస్తులు మార్చేందుకు ఎందుకు తెర ఉంచేరో తెలియటంలేదు. ఇప్పటి షాపు యజమానిని అడిగితే, తాను షాపు కొన్నప్పటి నుండి ఆ బొమ్మకు తెర ఉన్నది. తెర మూసే ఆ బొమ్మకు దుస్తులు మారుస్తామని ఆ షాపులోని వారు చెప్పిన తరువాత నాకు అది మార్చడం ఇష్టంలేదు అని చెప్పేరట. ఈ షాపు యొక్క ఇప్పటి యజమాని కూడా ఈ బొమ్మను ఎవరూ ముట్టుకోకుండా చూస్తారు. ఈ బొమ్మ గురించిన ప్రశ్నలు వేయకూడదని షాపుకు వచ్చెవారితో చెబుతాడట.
"మమ్మీలను భద్రపరిచిన విధంగానే ఈ బొమ్మను కూడా భద్రపరచి ఉంటారు. 1930 లలో అంతకంటే మెరుగైన పద్ధతి ఏదీలేదని, ఇది కూడా అలాంటిదేనని" అంటున్నారు అక్కడి ప్రజలు. కానీ ప్రభుత్వ రంగం ఈ బొమ్మ విషయంలో నోరు మెదపటంలేదు.ఈ బొమ్మ గురించిన వాస్తవాలు ఇంకా మర్మంగానే ఉన్నది.
మైనపు బొమ్మ అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే 1930 లలో మైనంతో బొమ్మలు చేసే పద్ధతి లేదు.

2012 లోనే ఈ బొమ్మ గురించిన ప్రచారం ఎక్కువైనది. 2014 నుండే ఈ బొమ్మ గురించి విరివిగా పత్రికలలో వార్తలు వచ్చేయి.

No comments:

Post a Comment