Wednesday, August 17, 2016

మిస్టరి: మరో ప్రపంచం నుండి వచ్చిన మనిషి?...ఫోటోలు మరియు వివరాలు

ఇప్పుడిప్పుడే భుమిలాంటి మరో గ్రహం ఉన్నది అని చెబుతున్నారు. కాని 1954 లో జపాన్ దేశములోని టోక్యో విమానాశ్రయంలో జరిగిన ఒక వింత సంఘటనను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే, బహుశా ఇప్పుడు చెబుతున్న భూమిలాంటి మరో గ్రహం ఎప్పటి నుండో ఉండి వుండవచ్చు, అందులో మనలాంటి మానవజాతి మనుగడ కలిగి ఉండవచ్చునేమో అనిపిస్తుంది.

1954 వ సంవత్సరం జూలై నెలలో టోక్యో విమానాశ్రయంలో ఒక మనిషి దిగేడు. చూడటానికి యూరప్ ఖండానికి చెందిన మనిషిలా కనిపించేడు. మన సంప్రదాయ రీతిలోనే ఉన్నాడు. కానీ విమానాశ్రయ అధికారులకు అతనిమీద అనుమానం వచ్చింది.
అతని పాస్ పోర్ట్ తనిఖీ చేసేరు. అతను టౌరడ్ అనే దేశానికి చెందినవాడని అందులో రాసుంది. అతని పాస్ పోర్ట్ వాస్తవమైన ఆధార స్థానం నుంచి ఇవ్వబడినట్లే ఉన్నది. కానీ అతను చెప్పిన దేశం మన ప్రపంచంలోనే లేదు.

అతన్ని విచారణకు తీసుకు వెళ్ళి అతని దేశం ఎక్కడుందో చెప్పమన్నారు. మ్యాపులో చూపించమన్నారు. అతను వెంటనే మ్యాపులోని “ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండొర్రా” అనే దేశంపై తన వేలు ఉంచి చూపించేడు(అండొర్రా: అధికారిక నామం ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండొర్రా. పశ్చిమ యూరప్ లోని ఒక చిన్న భూపరివేష్టిత దేశం. ఈ దేశం, పైరెనీస్ పర్వతాలకు తూర్పున, స్పెయిన్ మరియు ఫ్రాన్స్ దేశాలు సరిహద్దులుగా కలిగివున్నది). అయితే అతనికి వెంటనే కోపం వచ్చింది. కోపంతో పాటు గందరగోళంలో పడ్డాడు. అండొర్రా పేరు నేను ఎప్పుడూ వినలేదు. అయినా నా మాత్రుదేశం ఎందుకు ఈ మ్యాపులో లేదు అని అడిగేడు.

అతను చెప్పటం ప్రకారం అతని దేశం 1000 సంవత్సరాల నుండి ఉన్నది! అతని దగ్గరున్న డబ్బును చూపించమన్నారు. పలు యూరోపియన్ దేశాల కరెన్సీ అతని దగ్గర ఉన్నది.

అతని పాస్ పోర్ట్ మీద అతను ఇంతకు ముందు చాలా సార్లు వచ్చివెళ్ళినట్లు పలు దేశాల ముద్రలు ఉన్నాయి. టోక్యో కి వచ్చిన ముద్రలు కూడా ఉన్నాయి. తికమక పడిన అధికారులు అతన్ని ఖైదు చేసి టోక్యో నగరంలోని ఒక హోటల్లో ఉంచి, అతనికి కాపలాగా ఇద్దరు పోలీసులను ఉంచేరు. అతని పూర్తి వివరాలు తెలుసుకునేంత వరకు అతన్ని అక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నారు.
అతను ఒక కంపెనీలో పనిచేస్తున్నట్లు ఆధారాలు చూపించేడు. పోలీసులు ఆ కంపెనీకి ఫోన్ చేసి విచారించేరు. అటువంటి పేరుతో ఎవరూ పనిచేయడంలేదని ఆ కంపెనీవారు తెలియజేసేరు. మరి ఆ కంపెనీ ఆధారాలు అతని దగ్గర ఎలా ఉన్నాయి? అందులో అతని పేరు ఎలా వచ్చింది?

అతను ఒక హోటల్ పేరు చెప్పి అందులో తను రూము బుక్ చేసుకున్నట్లు చెప్పేడు. ఆ హోటల్ వారిని అడిగితే, ఆ పేరు మీద బుకింగ్ జరగలేదని తెలిపేరు. టోక్యోకి ఎందుకు వచ్చేవు అని అడిగినప్పుడు ఒక కంపెనీ పేరు చెప్పి వారితో వ్యాపారం చేయడానికి వచ్చేనని చెప్పేడు. మీరు ఊహించింది కరెక్టే. ఆ కంపెనీ వారు కూడా అలాంటి మనిషి మాకు తెలియదని తల అడ్డంగా ఊపేరు.

ఇక లాభం లేదని అతన్ని కోర్టుకు అప్పగించాలని అతని రూముకు వెళ్ళి తాళం తీసేరు. అతను అక్కడ లేడు. మాయమయ్యేడు. పోలీసులు కాపలా ఉన్నారు. తాళాలు తీయబడలేదు. కిటికీ కుండా పారిపోయుంటాడా? అవకాశమే లేదట. కారణం, అతని రూము పలు అంతస్తులున్న హోటల్ లోని రూము మరియు ఆ రూములో బాల్కనీయే లేదు.

అంతే అతన్ని మళ్ళీ ఎవరూ చూడలేదు. ఈ విషయం ఇంకా మిస్టరీగానే ఉన్నది.

ఇది ఒక కథ?
ఈ విషయం “The Directory of Possibilities”, Colin Wilson & John Grant [Corgi Paperback, 1982. ISBN: 0-552-119946]అనే పుస్తకంలో రాయబడింది. ప్రభుత్వ పత్రాలు గానీ, ఆ నాటి వార్తా పత్రికలలో గానీ, ఇతర ఆధారాలు లేవు. అండొర్రా అనే దేశం ఒకప్పుడు ఉండేది. పశ్చిమ దేశాల కూటమి ఆ దేశాన్ని ఆక్రమించింది. అండొర్రా లో ఎప్పుడూ రాజకీయ మార్పులు మరియు అంతర్ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏ దేశమైనా ఇతన్ని గూఢచారిగా పంపించి ఉండవచ్చు. అందుకనే జపాన్ ప్రభుత్వం అతని గురించిన వివరాలనూ మరియు అలాంటి విషయం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా చూసుకున్నదని కొంతమంది.....కాదు అతను ఖచ్చితంగా అక్షరేఖ కు అవతల పక్క ఉన్న ప్రపంచం నుండి వచ్చి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు. ఏది నిజమో తెలియదు కనుక ఈ విషయం అతిపెద్ద మిస్టరీగా ఉండిపోయింది.

No comments:

Post a Comment