Friday, July 29, 2016

ఎడారి హోటల్(రిసార్ట్): కాంక్రీట్ లేకుండా(ఉపయోగించకుండా) కట్టబడ్డ ఏకైక సృష్టి....ఫోటోలు మరియు వివరాలు

ఎడారి అంటే ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం అనేది అందరికీ తెలుసు. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సు లు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి. ఒయాసిస్ అంటే ఎడారిలో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతం. ఎడారిలో కూడా అప్పుడప్పుడూ వర్షం పడుతుంది. ఈ వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి క్రింద, అనగా రాతి పొర క్రింద, ఊటగా ఉంటుంది. ఎడారిలో ఇసుక రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్లా చెదురవుతాయి. అలా కొండల్లాంటి ఇసుక మేటలు ఒక చోటినుండి మరొక చోటికి కదులుతుంటాయి. ఒక ఘన మైలు (a cubic mile....1.6 ఘన కిలోమీటర్ cubic km) గాలి ద్వారా 4,600 టన్నుల ఇసుక ఒకచోటినుండి మరొక చోటికి కదులుతుంది. ఒక పెద్ద గాలి దుమారం 100 మిలియన్ టన్నుల ఇసుక లేదా మట్టిని స్థాన భ్రంశం చేస్తుంది. ఇలా ఇసుక మేటలు కదిలే ప్రక్రియలో కొన్ని ప్రాంతాలలో ఒరవడికి అక్కడి ఇసుక కొట్టుకుపోయి పల్లపు ప్రదేశం ఏర్పడుతుంది. ఆ పల్లపు భూతలం దాదాపు భూగర్భ జలం(water table) దగ్గరగా వస్తుంది. అలాంటిచోట పడిన విత్తనాలు మొలకెత్తి, వాటి వేళ్ళు క్రింద ఉన్న తడి ప్రదేశంలోకి విస్తరిస్తాయి. అక్కడ నీటి ఊటలు పైకి వచ్చి ఒయాసిస్గా ఏర్పడతాయి. ఒకో చోట ఇలా ఏర్పడిన పల్లపు ప్రాంతాలు చాలా విశాలమైనవి. ఉదాహరణకు సహారా ఎడారిలోని "ఖర్గా ఒయాసిస్" సుమారు 100 మైళ్ళ పొడవు, 12 నుండి 50 మైళ్ళ వరకు వెడల్పు అయినది.
అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం . ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.
ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిద్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు, కొన్ని రకాల కప్పలు ఇందులో ముఖ్యమైనవి.

అలాంటి ఎడారులలో ఒకటైన ఒక ఎడారిలోనే ఈ ఎడారి హోటల్(రిసార్ట్) కట్టేరు.
మంగోలియా దేశంలోని విస్తారమైన ఇసుక సముద్రం అని పిలువబడే ఎడారిని క్సియాంగ్షావన్ ఏడారి(Xiangshawan Desert) అని పిలుస్తారు. ఈ ఎడారిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని చెబుతారు. ఈ ఇసుక ఎడారిలోని ఇసుక దిబ్బల మధ్య ప్రాంతంలో అద్భుతమైన ఒక హోటల్ నిర్మించేరు. ఈ హోటలుకు "ఎడారి తామర పువ్వు హోటల్"(Desert Lotus Hotel) అని పేరు పెట్టేరు. ఇది చైనా రాజధాని బీజింగ్ నగరానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాంక్రీట్ లేకుండా(ఉపయోగించకుండా) కట్టబడ్డ ఏకైక సృష్టి. ఈ హోటల్ ప్రసిద్ధి చెందటానికి కాంక్రీట్ ఉపయోగించని భవనం అనేది మొదటి కారణమైతే, ఎడారులలో తేలే ఓడల డిజైన్ కలిగి ఉన్నదనేది రెండవ కారణం.
మంగోలియా ఒక భూపరివేష్టిత దేశం. ఇది తూర్పుఆసియా మరియు మధ్యాసియాలో వున్నది. దీనికి ఎల్లలు ఉత్తరాన రష్యా, దక్షిణం, తూర్పు మరియు పడమరలలో చైనా దేశాలున్నాయి.

ఈ హోటల్ పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ కార్బన్ డయాక్సైడ్ వెలువరిచే భావనతో నిర్మించేరు.
ఎడారి ఇసుక దిబ్బలలో హోటల్ కట్టాలి కనుక కాంక్రీట్ మరియు నీరు ఉపయోగించకుండా ఒక కొత్త నిర్మాణ వ్యవస్థను కనుగొన్నారు. ప్లాట్ ఆర్కిటెక్ట్స్ అనే సంస్థ ఈ తడి ఇసుకలో నిలబడగలిగే కొత్త ఇంజనీరింగ్ పద్దతిని కనుగొన్నది. ఉక్కు ప్యానెల్స్ తో పునాదిని తయారుచేసి, ఆ పునాదిపై ఉక్కు ఊచలతో హోటల్ నిర్మాణం చేసేరు. పునాది ఉక్కు ప్యానల్స్ పైన ఉక్కు స్ప్రింగులతో ఊచలు నిర్మించడంవలన హోటల్ తేలుతున్న భావన కలుగుతుంది(ఎడారి గాలికి కొంచంగా ఊగటం వలన). 30,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టబడిన ఈ హోటల్ ఎత్తు 40 మీటర్లు. నిర్మాణంలో హోటల్ పైకప్పులను పునరావృతమైన త్రిభుజాకార తెల్లటి గుడారాలతో వరుసక్రమంలో అమర్చేరు. అయితే 45 డిగ్రీల భ్రమణంతో ఒకదానికొకటి కలుసుకునేటట్లు తామర పువ్వు ఆకారంలో నిర్మించేరు. ఇటికలు, రాతి పలకలు, కాంక్రీట్ లేకుండా నిర్మించబడ్డ ఈ నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులు సౌర, నీటి మరియూ పవన విద్యుత్ శక్తిని మాత్రమే ఉపయోగించుకుంటాయి. దీని వలన పర్యావరణ కాలుష్యం తగ్గటమే కాకుండా, జీవావరణ రక్షణను బలపరిచేటట్లు చేస్తుంది.
ఈ హోటల్ వారు పర్యాటకులకోసం మంగోలియా దేశ సంస్కృతిక నేపథ్యంతో ప్రదర్శనలు, ఒంటె సవారీలు, ఎడారి సర్ఫింగ్ లాంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఎడారి “పాటలు పాడే” ఎడారిగా ప్రసిద్ది చెందింది. ఎడారిలో శాంతంగా ఉండే మట్టిని భగ్నపరిస్తే గర్జించు మరియు విజృంభిస్తున్న శబ్ధం వినబడుతుంది(ఈ ప్రకృతి సంఘటన ఎందుకు/ఎలా జరుగుతోందో ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు).
ఈ ఎడారిలో కొన్ని రోజుల గడపటానికి, ఇసుక దిబ్బలు పాడే పాటలను వినడానికి, తేలే హోటల్ యొక్క ఇంజనీరింగ్ వండర్ను చూడటానికి ఎంతోమంది పర్యాటకులు వచ్చి వెడుతున్నారట.

1 comment: 1. అందాల యెడారి నడుమ
  వింతల గొల్పుచు నిలచెను వేడుక గన మా
  నందమగు తామరవలెన్
  కొంతయు కాంక్రీటులేక క్రొంగొత్తగనౌ !

  జిలేబి

  ReplyDelete