Sunday, July 24, 2016

మిస్టరీ:---నిశ్శబ్ద మండలము....ఫోటోలు మరియు వివరాలు

మెక్సికో దేశ సరిహద్దులొ ఉన్నది ఈ నిశ్శబ్ద మండలము. ఈ మండాలానికి దగ్గరగా ఉన్న గ్రామము పేరు మాపిమి (Mapimi). అందువలన ఈ ప్రదేశాన్ని మాపిమి నిశ్శబ్ద మండలము (Mapimi Silent Zone) అని పిలుస్తారు. ఇక్కడ, అంటే ఈ నిశ్శబ్ద మండలములో ఎటువంటి శబ్ధమూ వినబడకపోవటం వలనే ఈ మండలాన్ని నిశ్శబ్ద మండలము అని పిలుస్తున్నారు. అంతేకాక, ఈ మండలం ఆకాశములో నుండి వస్తువులను లాక్కుంటుందట. అలా లాకునేటప్పుడు కూడా ఎటువంటి శబ్ధమూ వినబడదట. అపోలో రాకెట్ బూస్టర్లు, పరీక్షా క్షిపణిలు మరియు ఒక భారీ ఉల్క ఈ మండలంలో పడి ఉన్నాయట.
పురాణం ప్రకారం ఈ మండలంలో ఎలెక్ట్రో మాగ్నటిక్ ప్రసారాలు అందుకోవు, రేడియో పనిచేయదు, దిక్సూచి దిక్కులను చూపదు. ఈ మండలంలో పువ్వులు మరియు జంతుజాలం అస్వభావిక ఉత్పరివర్తనాలు కలిగి ఉంటాయట. (జన్యువులలో అకస్మాత్తుగా సంభవించే, అనువంశికంగా తరువాత తరాలకు సంభవించే మార్పులే ఉత్పరివర్తనాలు (Mutations). అనువంశకం కాగల హటాత్తుగా సంభవించు వైవిధ్యాలను ఉత్పరివర్తనలు అంటారు. 1900 సంవత్సరంలో హ్యుగ్రో డెవ్రోస్, ఈనోధిరా లామార్కియానా అను మొక్కలో వీటిని గమనించారు. ఉత్పరివర్తనలు జన్యు లేక క్రోమోజోము సంబంధమైనవి కావచ్చును. ఉత్పరివర్తనలు దృశ్యరూపకంగా పెద్దమార్వును కలిగించవచ్చు)
ఆశ్చర్యంగా ఉంది కదూ. భూమండలంపై ఇలాంటి ఒకచోటు ఉన్నదని చాలామందికి తెలియదు. 1970 వ సంవత్సరములో, ప్రపంచములోని కొందరికి మాత్రమే ఈ మండలము ఉన్నదని తెలిసింది. ఇప్పుడిప్పుడే ఈ మండలం గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ నిశ్శబ్ద మండలములో గ్రహాంతర వాసులు కలుసుకుంటున్నట్లు, వేడి గులకరాళ్ళ పడుతున్నట్లు, అతీత శక్తులు తిరుగుతున్నట్లు కధలు వెలువడటంతో పర్యాటకులు మరియు ఈ విషయాలపై ఆసక్తి గలవారు ప్రపంచపు నలుమూలల నుండి రావడం మొదలు పెట్టేరు.

మరి దీని కధ, ఈ మండలాన్ని ఎలా కనుకున్నారు, ఈ మండలంలో ఇంకా ఏమేమి జరుగుతున్నది....అనే విషయాలు మనం కూడా తెలుసుకుందాము.

ఇది ఒక ఎడారి ప్రదేశం. 1970లో అమెరికా దేశం తమ వైట్ సాండ్స్ క్షిపణి కేంద్రం (White Sands Missile Base) నుండి, ఒక క్షిపణిని పరీక్ష చేసేరు. అది విఫలమైంది. దారి తప్పి మర్మమైన ఈ ఎడారిలో పడిపోయింది. మెక్సికో దేశ సరిహద్దులో ఒక ఎడారి ఉన్నదని అప్పుడే తెలిసింది ప్రపంచానికి. విఫలమైన క్షిపణి ముక్కలను, అందులో అమర్చబడిన అత్యంత ఆధునిక కంప్యూటర్ భాగాలను తీసుకురావాలని, మెక్సికో ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని క్షిపణి పడిపోయిన ప్రదేశానికి బయలుదేరింది అమెరికా విమాన దళ బృందం. పడిపోయిందనుకున్న చోటుకు జేరుకున్న వారికి క్షిపణి ఆచూకి తెలియలేదు. తమ దగ్గరున్న పరికరాలతో క్షిపణి పడిపోయిన ప్రదేశాన్ని తెలుసుకోవాలనుకున్నారు. వారి దగ్గరున్న పరికరాలు పనిచేయలేదు. అమెరికా ప్రధాన విమాన దళం కేంద్రంతో మాట్లాడుకోవటానికి తెచ్చిన వాకీటాకీ, రేడియోలు పనిచేయలేదు. కొంత ప్రయత్నం తరువాత ఆ ప్రదేశంలో(మండలంలో) ఆ పరికరాలు పనిచేయవని తెలుసుకున్నారు. దానికి కారణం కూడా తెలుసుకున్నారు. అంతే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. శాస్త్రవేత్తలతో మరో అమెరికా బృందం అక్కడికి చేరుకున్నది. చిన్న, చిన్న బృందాలుగా విడిపోయి నలువైపుల వెతికిన వారికి మూడు వారాల తరువాత క్షిపణి కనబడింది. పెద్ద, పెద్ద ముక్కలుగా విరిగిపోయి ఉన్నది. దానిని/వాటిని తీసుకురావడానికి వైమానిక రన్వే ఏర్పాటు చేయవలసి వచ్చింది. మొత్త కార్యక్రమం హడావిడిగా చేయడం, విషయాలను రహస్యంగా ఉంచడం వలన, ఎవరడిగినా ఏమీ చెప్పకపోవడంతో ప్రజలలోను, మిగిలిన ప్రపంచ దేశాల అధికారులలోను సంచలనం ఏర్పరిచింది. ఇది ఎన్నో ఊహాగానాలకు దారితీసింది.
క్షిపణి పడున్న ప్రాంతం చుట్టూ రక్షణ కంచె వేసి, అక్కడ కాపలాకొసం ఎడారిలో కనిపించిన ఒక మనిషిని ఏర్పాటుచేసేరు అమెరికా విమాన దళ బృందం. క్షిపణిని చూడటానికి అన్య గ్రహవాసులు వచ్చి వెడుతున్నారని అతను అక్కడకు వచ్చిన పత్రికవారితో చెప్పడం, పత్రికల వారు వార్తను ప్రచురించడంతో ఈ మండలం మరింత ప్రాధన్యం పొందింది.
మెక్సికో ప్రభుత్వం అక్కడ ఒక పరిశోధనా కేంద్రం ఏర్పరచింది. ఆ మండలంలో జీవావరణం గురించి ప్రశోధనలు చేయడానికే అది నిర్మించేమని తెలిపేరు. దీనిని ఎవరూ ఆమోదించలేకపోయేరు. ఏవో రహస్య పరిశొధనలు జరుగుతున్నాయని, నిశ్శబ్ద మండలముకు సంబంధించిన విషయాలను పరిశోధిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ పరిశోధనా కేంద్రమే ఈ మండలంలో ఎలెక్ట్రో మాగ్నటిక్ ప్రసారాలు అందుకోవు, రేడియో పనిచేయదు, దిక్సూచి దిక్కులను చూపదు, మండలంలో పువ్వులు మరియు జంతుజాలం అస్వభావిక ఉత్పరివర్తనాలు కలిగి ఉన్నాయని తెలిపింది.
1969లో ఈ మండలంలో అల్లన్ డే (Allende) అనే ఒక ఉల్క పడింది. ఈ మండలంలో ఏదో అద్భుత శక్తి ఉన్నదని చెప్పడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా చెప్పబడుతోంది. 1930లో మెక్సికో విమాన పైలట్ Francisco Sarabia తన విమానం ఈ మండలంపైన ఎగురుతున్నప్పుడు కమ్యూనికేషన్ పరికారాలు పనిచేయలేదని తన పై అధికారులతో తెలిపినట్లు మెక్సికో ప్రభుత్వం దగ్గర ఒక అధికార పత్రం ఉందట. ఇవన్నీ నిశ్శబ్ద మండలములో జరుగుతున్న విషయాలను దృవీకరిస్తున్నాయి.
తమ వార్తా పత్రికకు వార్తలు సేకరించడానికి వెళ్ళిన ఇద్దరు మెక్సికో పత్రికా విలేఖరులు, తాము దారి తెలియక గందరగోలం పడుతున్నప్పుడు అన్యగ్రహవాసుల లాంటి వారు తమకు క్షిపణి పడున్న చోటుకు దారి చూపిస్తూ, క్షిపణి పడున్న చోటుకు తీసుకు వెళ్ళేరని, ఆ రాత్రంతా ఆ మండలంపై ఎవో వెలుతురులు కనబడ్డాయని తమ పత్రికలో రాసేరు.

మెక్సికో ప్రభుత్వం గానీ, అమెరికా ప్రభుత్వం గానీ ఈ నిశ్శబ్ద మండలము గురించిన విషయాలను తెలుపటంలేదు. ఈ నిశ్శబ్ద మండలములో జరుగుతున్నాయని చెబుతున్న సంఘటనలు సైన్సుకు సంబంధించినవా? అద్భుతాలా? ఇంద్రజాలమా?......ఇదే మిస్టరీగా ఉన్నది.

No comments:

Post a Comment