Monday, July 18, 2016

హిరోషిమాలో అణ్వస్త్ర దాడులను తట్టుకున్న చెట్లు...వివరాలు మరియు ఫోటోలు

1945లో రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో, జపాన్ నగరాలైన హిరోషిమా మరియు నాగసాకిలపై రెండు అణు బాంబు దాడులు జరగటం మీకందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో అణ్వస్త్రాలు ఉపయోగించిన సందర్భాలు ఇవి మాత్రమే కావడం గమనార్హం. జపాన్ యొక్క రెండో ప్రధాన సైనిక కేంద్రాన్ని కలిగివుండి సైనిక ప్రాధాన్యత ఉన్న నగరం కావడంతోపాటు, సమాచార ప్రసార కేంద్రంగా మరియు నిల్వ గోదాముగా ఉండటం వలన హిరోషిమాను బాంబు దాడికి లక్ష్యంగా ఎంచుకున్నారు.
బాంబు దాడి జరిగిన తరువాత మొదటి రెండు నుంచి నాలుగు నెలల కాలంలో అణ్వస్త్ర ప్రభావాలతో హిరోషిమాలో 90,000–166,000 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో సగం మంది బాంబు దాడి జరిగిన మొదటి రోజునే మరణించేరు. ప్రకృతి దృశ్యాలు నేలమట్టం అయ్యేయి. నేలలు కోసుకుపోయినై. ఎక్కడచూసిన రేడియేషన్ ప్రభావం. "ఇకమీదట హిరోషిమాలో ఎవరూ జీవించలేరు. ఎందుకంటే ఈ నేలపై 75 సంవత్సరాలవరకు ఏమీ పండదు" అని అప్పటి మాన్ హట్టన్ ప్రాజక్ట్ శాస్త్రవేత్త డాక్టర్. హెరాల్డ్ జాకబ్ సన్ వాషింగ్టన్ పోస్ట్ వార్తా పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపేరు.
కానీ ప్రకృతి ఇతర ప్రణాళికలతో ఉన్నది. అందరినీ ఆశ్చర్యం మరియు ఆనందంలో ముంచెత్తే విధంగా బాంబు దాడి జరిగిన తరువాత వచ్చిన వసంతకాలంలోనే నగరంలోని శిధిలాల మధ్య పచ్చని మెలకలు తలెత్తినై. అణ్వస్త్ర దాడిలో ప్రాణాలతో బయటపడ్డవారికి ఈ పచ్చని మొలకలు ఒక శక్తివంతమైన సందేశం అందించినై. నగరాన్ని పునర్నిర్మాణం చేసుకోవచ్చు అనే ఆశను వారిలో కలిగించింది. మానవులు తమ మేధా శక్తితో సహమానవులను నాశనం చేయవచ్చునేమోగాని ప్రకృతిని మాత్రం వారనుకునే విధముగా నాశనం చేయలేరని నిరూపించింది.
ఈ రోజు, అంటే అణ్వస్త్ర దాడి జరిగిన 60 సంవత్సరాల తరువాత హిరోషిమా పచ్చగానూ మరియూ శక్తివంతమైన ఆధునిక నగరంగా మారింది. అణ్వస్త్ర దాడి తరువాత హిరోషిమా నగరంలో నాటిన చాలా చెట్లు వారికి బహుమతిగా విదేశీ దాతలు మరియు జపాన్ దేశములొని ఇతర ప్రాంతాలలోని దాతలు ఇచ్చినవే. కానీ , ఇప్పుడు ఆ నగరంలో పచ్చగా కనబడుతున్న వందాలది చెట్లు ఒకప్పుడు అణ్వస్త్ర దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్నవే. అయితే, ఈ పచ్చని చెట్లు అప్పుడు(అణ్వస్త్ర దాడిలో) విరిగిన మరియు కాలిపోయిన చెట్లే కాని మరణించినవి కావు. అణ్వస్త్ర దాడిలో దెబ్బతిన్న ఈ చెట్లు త్వరలో మళ్లీ ఆరోగ్యవంతంగా దిద్దుకున్నాయి.
యుద్ధం తరువాత ఇలాంటి చాలా చెట్లను బాంబు పడిన ప్రదేశానికి 2 కిలొమీటర్ల వ్యాసార్థంలో సంరక్షించేరు. ఈ రోజు ఈ చెట్లను "అణ్వస్త్ర దాడి చెట్లు" అనే పెరుతో నమోదు చేసేరు. ఒక్కొక్క చెట్టునూ వారి భాషలో "హిబకు జుమోకు" = ప్రాణాలతో ఉన్న చెట్టు అని పిలుస్తూ వాటిని గుర్తించడానికి పేర్ల పలకలను ఉంచేరు. హిరోషీమా నగర అధికారుల ప్రకారం ఇలాంటి చెట్లు 170కు పైగా ఉన్నాయని, అవి వివిధ రకాలకు చెందినవని తెలిపేరు.
అణ్వస్త్ర బాంబు పడిన చోటుకు అతి దగ్గరలో ఉన్న చెట్టు వీపింగ్ విల్లో(Salix babylonica). ఇది అణ్వస్త్ర బాంబు పడిన చోటుకు 370 మీటర్ల దూరంలో ఉండేది. అణ్వస్త్ర బాంబు దాడిలో చెట్టు మొత్తం నాశనమైనా, చెట్టు వేర్లకు ఎటువంటి హాని జరగలేదు. అందువలన ఆ చెట్టు వెంటనే మళ్ళీ పెరగడం మొదలు పెట్టింది. ఈ చెట్లు ఇప్పుడు ప్రజా భవనాలలో, మందిరాలలో మరియూ మఠాలలో హీరోషీమా నగర ప్రభుత్వ సంరక్షణలో ఉన్నాయి.
ఈ అణ్వస్త్ర దాడి చెట్ల యొక్క విత్తనాలను హిరోషీమా నగర వాసులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పంచబడ్డాయి. ఇప్పుడు ఆ చెట్లు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.

అణ్వస్త్ర ఆయుధాలు:

ప్రకృతిని ఏమీచేయలేకపోయినా అణ్వస్త్ర ఆయుధాలు మానవ జాతిని సర్వనాశనం చెయగలవు అనేది తెలుసుకున్న ప్రజాప్రతినిధులు ప్రపంచాన్ని అణ్వస్త్ర రహితంగా తీర్చిదిద్దాలన్న కొరికను ముందుపెట్టేరు.
అమెరికా దేశం సోమవారం ఆగస్టు 6, 1945న "లిటిల్ బాయ్" అనే అణ్వాయుధాన్ని హిరోషిమా నగరంపై జారవిడిచింది. 1946లో మొదటి తీర్మానం ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ప్రవేశపెట్టేరు. 1959 నుంచి ఐక్యరాజ్య సమితి అజెండాగా మారింది. 1970లో అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం అమలులోకి వచ్చింది.
ఒకవైపు అణ్వస్త్ర నిర్మూలనకోసం ప్రయత్నాలు జరుగుతున్నా, మరోవైపు ప్రపంచంలో అణ్వస్త్ర రాశులు పేరుకుపోయాయి. అణ్వస్త్రాలున్న దేశాలు తమ అణ్వాయుధాగారాలకు పదునుపెట్టడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తూనే ఉన్నాయి. అపారంగా నిధులు గుమ్మరిస్తూనే ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగంకన్నా ఎక్కువమంది అణ్వస్త్రాల నీడలోనే కాలం గడపాల్సి వస్తోంది. మొదటి నుంచీ అణ్వస్త్రాలున్న దేశాలు అయిదే అయినా, ప్రస్తుతం వీటి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మరికొన్ని అణ్వస్త్ర దేశాల ఛత్రఛాయల్లో ఉన్నాయి. అణ్వస్త్ర నిరాయుధీకరణ కోసం సంప్రతింపులూ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ 2014 వరకు ఒక్క అణ్వస్త్రమైనా నిరాయుధీకరణ పరిధిలోకి రాలేదు. అణ్వస్త్ర ప్రయోగాన్ని నియంత్రించడానికి తమ వద్ద ఉన్న ఆయుధాలు ఉపకరిస్తాయని అణ్వస్త్ర దేశాలు వాదిస్తున్నాయి. ఒక్క అణ్వస్త్రాన్ని ప్రయోగించినా జరగబోయే బీభత్సమేమిటో స్పష్టంగా తెలిసినా ఆ దేశాల వైఖరిలో మార్పు రావడం లేదు.
ప్రపంచ దేశాలు అణ్వస్త్ర ఆయుధాలకు స్వస్తి చెప్పే తరుణం త్వరగా రావాలని కోరుకుందాం.

No comments:

Post a Comment