Monday, July 11, 2016

మిస్టరీ:...మరణించినా కర్తవ్యము విడిచిపెట్టని సిపాయి...ఫోటోలు మరియు వివరాలు

సిక్కింలోని టీస్టా నది దాటుతున్నప్పుడు టాక్సీ డ్రైవర్స్ "హర్బజన్ బాబాకీ జై" అంటూ నినాదాలు చేస్తూ నదిని దాటుతారు. సిక్కింలో "హర్బజన్ బాబా" ని పవిత్రమైన వ్యక్తిగా గౌరవిస్తారు.

ఎవరీ "హర్బజన్ బాబా"?

పంజాబుకు చెందిన హర్బజన్ సింగ్ ఫిబ్రవరి-6, 1966లో భారత సైనిక దళంలో చేరేడు. ఇతన్ని హిమాలయా పర్వతాలలొనే ఎత్తైన ప్రదేశం, భారత-చైనా సరిహద్దు(భారత సరిహద్దు సిక్కిం, చైనా సరిహద్దు టిబెట్)దారి ప్రాంతమైన నాతుల్లాలో భద్రతా కర్తవ్యము నిర్వహించే పనిలో ఉంచేరు.

1968లో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ప్రాంతమంతా వరదమయమయ్యింది. ఆక్టొబర్-4, 1968, తన సైనికాధికారులనూ, సహ సైనికులను వేరే చోటుకు మార్చే పనిలో వారికి దారి చూపే ముఖ్య వ్యక్తిగా వ్యవహరించేడు. దురదృష్టవసాత్తు హర్బజన్ సింగ్ వరదనీటిలో పడిపోయి కొట్టుకుపోయేడు. అతనికోసం రెండురోజులు గాలించేరు. శీతల వాతావరణం కారణంగా అతన్ని వెతికే పనిని వదిలివేయవలసి వచ్చింది.

వరదలు తగ్గి, వాతావరణం సరైన తరువాత ఒకరోజు క్యాంపులో నిదురిస్తున్న ఒక సిపాయి కలలో హర్బజన్ సింగ్ కనబడి "నేను చనిపోయేను. నా శరీరం ఫలానా చోట ఉన్నది. నా శరీరం దొరికిన చోట నాకు సమాధి కట్టండి. నేను ఎప్పటికీ సిపాయిగానే ఉంటూ మన సరిహద్దును కాపలాకాస్తూనే ఉంటాను" అని చెప్పి కలలో నుండి కనుమరుగయ్యేడు. హర్బజన్ వరదనీటిలో కొట్టుకెళ్ళిపోయేడన్న శోకంలో ఉండటం వలన తనకు అలా అనిపించి ఉంటుందని ఆ సిపాయి అనుకున్నాడు. హర్బజన్ సింగ్ మరో సిపాయి కలలో కూడా కనిపించి ఇదే మాటలు చెప్పడంతో అనుమానాలు తలెత్తినై. ఒక సెర్చ్ పార్టీని హర్బజన్ సింగ్ కలలో చెప్పిన చోటుకు పంపించేరు. హర్బజన్ సింగ్ మృతదేహం అక్కడ దొరికింది. అందరూ ఆశ్చర్యపోయేరు. హర్బజన్ సింగ్ కలలో చెప్పినట్లే అతని దేహం దొరికన ప్రదేశంలోనే పూర్తి మిలటరీ లాంఛనాలతో 'హర్బజన్ సింగ్' అంత్యక్రియలు పూర్తిచేసి అక్కడే అతని సమాధి నిర్మించేరు. ఆ ప్రదేశం పేరు చొక్యా చో.

కొద్ది రోజుల తరువాత ఆ సరిహద్దు ప్రాంతంలొని భద్రత పనులలో డ్యూటీ చేస్తున్న సిపాయులకు అప్పుడప్పుడు ఓక సిపాయి గుర్రం మీద గస్తీ చేస్తూ తిరుగుతూ ఉండటం కనిపించిందట. ఆ విషయాన్ని పై అధికారులకు తెలిపేరట. భారత సరిహద్దుకు అవతలవైపున్న చైనా సిపాయులు కూడా ఆ ఘోస్ట్ రైడర్ ను చూసినట్లు తెలిపేరు. ఆ ఘోస్ట్ రైడర్ 'హర్బజన్ సింగ్' గే అనే నిర్ణయానికి వచ్చేరు. హర్బజన్ సింగ్ కొంతమంది భారత సిపాయుల కలలో కనబడి చైనా దళాలు ఎటు నుండి రావటానికి అవకాశమున్నదో చెప్పేవాడట. అతను చెప్పింది చాలా వరకు నిజమయ్యేదట. దీనితో హర్బజన్ సింగ్ తిరిగి వచ్చేడని నమ్మేరు. అతను పురాణ పురుషుడయ్యేడు.

హర్బజన్ సింగ్ సమాధి దేవాలయంగా మారింది. ప్రజాదరణ పొందింది. అది పుణ్యక్షేత్రంగా మారింది. ప్రజలు రావడం, సమాధికి మొక్కడం మొదలయ్యింది. సమాధిని మూడు రూముల ఇళ్ళుగా చేసేరు. హర్బజన్ సింగ్ నిద్రపోవడానికి ఒక గది(మంచముతో), అతని ఫోటో,అతని యూనీఫారం,బూట్లు, బెల్ట్, టోపీ గల ఒక రూము(భక్తులు వీటన్నిటినీ తాకి కళ్లకు అద్దుకుంటారు), మరొక రూము ఆ క్షేత్రమునకు బాధ్యతలు తీసుకొనే వ్యక్తులకొరకు కేటాయించేరు. క్షేత్రమును చూసుకునేవారు రోజూ అతని మంచం మీద ఉన్న దుప్పటి ఎవరో పడుకుని వెళ్ళినట్లు చిందరవందరగా ఉంటోందని తెలిపేరు. ప్రొద్దున్నే పాలీష్ చేసి ఉంచిన బూట్లు మరుసటి రోజు ప్రొద్దుటికి బురదమయంగా ఉండేవట. అప్పటి నుండి ప్రజలు లారీలలో రావడం మొదలు పెట్టేరు.

చనిపోయిన సిపాయి హర్బజన్ సింగ్ ప్రాముఖ్యత తెలుసుకున్న భారత సైన్యం అతని సేవలను గౌరవిస్తూ అతనికి "గౌరవ కెప్టెన్" పదవి ఇచ్చి గౌరవించేరు. కపుర్తాలాలో ఉన్న అతని ఇంటికి ఆ జీతం పంపిస్తారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే అతనికి సంవత్సరానికి ఒక నెల సెలవు ఇచ్చేవారు. ఆ సెలవులప్పుడు హర్బజన్ సింగ్ ట్రంకు పెట్టెను తీసుకుని ఇద్దరు సిపాయులు అతని ఇంటికి వెళ్ళి, నెల రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగివచ్చేవారట. ఈ సాంప్రదాయము కొన్ని సంవత్సరాల ముందువరకు జరిగిందట. అంటే అతను రిటైర్ అయ్యేంత వరకు.

సిక్కిం మరియు బెంగాల్ రాష్ట్రాలలో భక్తి, నమ్మకం ఉన్న ప్రజలు జబ్బుపడిన వారిని, వృద్ధులను అద్భుతం జరుగుతుందనే దృడవిశ్వాసముతో వారిని హర్బజన్ సింగ్ సమాధికి తీసుకు వస్తారు. వారితో పాటు నీళ్ళ సీసాలు తీసుకు వచ్చి అక్కడ పెట్టి, అక్కడున్న వేరే నీటి సీసాలను తీసుకువెడతారు. సమాధి దగ్గర నీటి సీసా ఉంచితే, కొన్ని రోజులకు ఆ సీసాలోని నీరు పవిత్రంగా మారుతుందని, ఆ నీటిని తాగితే వ్యాధులు నయమవుతాయని వారి నమ్మకం. 14000 అడుగుల ఎత్తులో ఉన్న హర్బజన్ సింగ్ సమాధికి వచ్చే భక్తులందరికీ అన్నదానం చేస్తారు.

భారత-చైనా సరిహద్దు ప్రాంతమైన నాతుల్లాను ఈ మధ్యే సాధారణ పౌరల రాకకు తెరిచేరు. హర్బజన్ సింగ్ సమాధిని చూడటానికి ఏ మతానికి చెందిన వారైనా రావచ్చు. చైనా దేశ ప్రజలు కూడా ఇటువంటి నమ్మకాలున్నవారే. భారత-చైనా సరిహద్దులో ప్రతి నెల ఇరుదేశాలూ నిర్వహించే శాంతి సమావేశాలలో(Flag Meeting)చైనా సైనిక అధికారులు హర్బజన్ సింగ్ కొరకు ఒక కుర్చీ వేసి ఉంచుతారు.


3 comments:

 1. అద్భుతం. మరి హర్బజన్ బాబాకు మరణానంతర పురస్కారం ఏమన్నా వచ్చిందా? లేదా అతని త్యాగం ఏవో ఒకటి రెండు మహత్తరత్యాగ కుటుంబాల త్యాగాలకు(?) ఏమీ సరిపోలదనే లెక్కవేసేసారా?

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారికి

   మరణానంతర పురస్కారం ఇచ్చినట్లు ఎక్కడా ఇన్ ఫర్మేషన్ లేదు సార్....ఇప్పటికీ హర్బజన్ బాబాను కొలుస్తున్నారని మాత్రం తెలిపేరు.

   మీకొసం

   Delete
  2. అనుకున్నానండీ. కాని అలాంటిది చిన్నదో చితకదో ఒకటి అయన స్మృతిచిహ్నంగా మన సెకులర్ ప్రభుత్వం వారు ఇవ్వటం మంచిదండీ. లేకపోతే మరికొన్ని సంవత్సరాలతరువాత రాబోయే తరాల హేతువాదులు హర్భజన్ బాబా అనేవాడు ఎవడూ లేడని వాదించి ప్రజల్లో ఉన్న ఆ మూఢవిశ్వాసాన్ని పారద్రోలి విజ్ఞానహజ్యోతుల్ని వెలిగించటానికి కంకణం కట్టుకుంటారు. అప్పుడు ఎవరైనా పాతకాలపు ప్రభుత్వరికార్డులను చూపినా అవన్నీ కొందరు కుట్రపూరితంగా సృష్టించినవని కూడా బల్లగుద్ధి మరీ వాదిస్తారు నమ్మండి.

   Delete