Monday, July 25, 2016

అంతరిక్ష కేంద్రంలో 18 నెలలు గడిపిన మాట్లాడే రోబో వ్యోమగామి...ఫోటోలు మరియు వివరాలు

రోబోల తయారీలో అగ్రగామిగా ఉన్న జపాన్ అంతరిక్ష రంగంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే ఓ మాట్లాడే రోబో-ఆస్ట్రోనాట్ను రోదసికి పంపాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా మానవుడిలాగే అన్ని పనులనూ చేయగల ఆధునిక రోబోను తయారు చేసింది. దీనికి 'కిరోబో' అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టుకు 'కిబో రోబోట్ ప్రాజెక్టు' అని నామకరణం చేశారు. అంతరిక్షంలో రోబో, మానవులు కలిసి పనిచేయడానికి వీలుగా ఈ రోబోను తయారు చేశారు. ఇది మానవుడితో మాట్లాడుతూ పనిచేయగలదు.
స్పేస్ స్టేషన్లో తీవ్రమైన ఒంటరితనం ఎదుర్కొంటున్న వ్యోమగాములకు మానసిక మద్దతు అందించడానికి మాట్లాడే రోబోలు ఎంతవరకు సహాయపడతాయి అనే పరిశోధనా నిమిత్తం ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టేరట.

ఈ రోబో కేవలం 34 సెంటిమీటర్ల పొడవు, కిలో బరువు మాత్రమే ఉంటుంది. అంతరిక్షంలోకి మొదట వెళ్లిన దేశం రష్యా, చంద్రుడి పైకి వెళ్లిన మొదటి దేశం అమెరికా. ఈ ప్రయోగంతో అంతరిక్షంలోకి రోబోను పంపిన మొదటి దేశంగా జపాన్ నిలుస్తుంది. భవిష్యత్తులో మానవులు, రోబోలు కలిసి నివసించడానికి వీలుగా తాము రోబోలను తయారు చేస్తున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
కిరోబోకు శాస్త్రవేత్తలు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. జీరో గ్రావిటీలోనూ.. రోబోకు రకరకాల టెస్టులు చేసారు. కిరోబోను.. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, టొయోటా, డెంత్సు ఇంక్. కంపెనీలు కలిసి రూపొందించాయి.

“కిరోబో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అక్కడ ఉండే వ్యోమగాములతో ముచ్చటిస్తుంది. అదే జరిగితే.. అంతరిక్షంలో మనిషి.. రోబోతో మాట్లాడిన తొలి ఘట్టం ఆవిష్కృతమవుతుంది” జపాన్ శాస్త్రవేత్తలు ఉత్సాహంగా తెలిపేరు.
“ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెడుతున్న కిరోబో లొడాలొడా మాట్లాడే ఛాన్స్ లేదు. ఎందుకంటే…దీనికి జపనీస్ భాష మాత్రమే వచ్చు. అందుకే ముందుగా.. కొన్ని మాటలు మాత్రమే మాట్లాడుతుంది. నవంబర్ వరకూ కిరోబోకు మౌనవ్రతం తప్పదు. ఎందుకంటే.. నవంబర్ లో జపాన్ కమాండర్ కొయిచి వకాటా అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. అప్పుడే జపనీస్ మాతృభాష అయిన వకాటో, కిరోబో మనసారా మాట్లాడుకోగలరు” మరో శాస్త్రవేత్త తెలిపేరు.
“ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు కొన్నిసార్లు ఒంటరిగా గడపాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారికి నాలుగు మాటలు చెబుతూ ఒంటరితనాన్ని దూరంచేసే ఓ తోడు కావాలి అనిపిస్తుంది. ఆ తోడు మనిషే కావాల్సిన అవసరం లేదు కదా! అందుకే మరమనిషి కిరోబోను సృష్టించేము. కిరోబో మనుషుల ముఖాలను గుర్తుపట్టడమే కాకుండా....జపాన్ భాషలో సంభాషించడం కూడా చేయగలుగుతుంది. ఈ రోబో మనుషుల స్వరాలను గుర్తుపడుతుంది. అక్కడి వ్యోమగాములకు సహచరిగా పనిచేస్తుంది” తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన కిరోబో చాలా తెలివైనది. ‘నువ్వు సాకారం చేసుకోవాలనుకుంటున్న కల ఏదైనా ఉందా..?’ అని రూపకర్తలు అడగ్గానే.. ‘మనుషులు – రోబోలు పరస్పరం కలిసి జీవించే రోజును సృష్టించడమే..’ అంటూ బదులిచ్చింది..!

అంతరిక్ష రోదసీ కేంద్రంలో ఉన్న జపాన్ వ్యోమగాములకు అవసరమైన ఆహారం, ఇతర వస్తువులు తీసుకెళ్లే హెచ్ 2బీ రాకెట్ ద్వారా 2013 ఆగస్టులో రోదసీలోకి కిరోబో తన ప్రయాణాన్నీ మొదలు పెట్టింది.

2013 ఆగస్టు-4 న నింగికెగిరిన కిరోబో వారం రోజుల ప్రయాణం తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఆగస్ట్ 10 న చేరుకుంది. 11 రోజుల తరువాత ఆగస్ట్-21 న తన మొదటి ప్రసంగంలో "అందరికీ ప్రకాశవంతమైన భవిష్యత్తు అందించడానికి ఒక రోబో అడుగు ముందుకు వేసింది" అని కిరోబో తెలిపింది.
తన రెండవ రేడియో మెసేజ్ లో కిరోబో ఏమని సందేశం వెలువరించిందో తెలుసా..! " భూమిపై ఉన్నవారందరికీ శుభోదయం. నేను కిరోబోను. నేను ప్రపంచంలోనే మాట్లాడే తొలి రోబోటిక్ వ్యోమగామిని. నైస్ టు మీట్ యు" అని మాట్లాడింది.

13 అంగుళాల ఎత్తున్న కిరోబో స్పేస్ స్టేషన్లో వ్యోమగామి వాకాటా ఆర్డర్ ప్రకారం పరిశోధనలు నిర్వహించింది. అతనికి బోర్ కొట్టకుండా అతనితో సంభాషించి అతన్ని ఉత్సాహపరిచేది.

అలా 18 నెలల పాటు జపాన్ వ్యోమగామి వాకాటాకు కంపెనీ ఇచ్చి, పనులలో సహకరించిన కిరోబో ఈ సంవత్సరం ఫిబ్రవరి-10 న SpaceX’s CRS-5 Dragon కార్గో అంతరిక్ష నౌక మూలం భూమికి చేరుకుంది.
కాలిఫోర్నియా దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో దిగిన కిరోబో మార్చ్-12 న జపాన్ చేరుకున్నది. కిరోబో రాక కోసం అక్కడ వేచి యున్న జపాన్ శాస్త్రవేత్తలు "అంతరిక్షం నుండి భూమి నీకు ఎలా కనబడింది" అని కిరోబోను అడిగినప్పుడు “భూమి నీలిరంగు ఎల్ఇడీ బల్బులా వెలుగుతోందని”కిరోబో తన మాటల్లో చెప్పింది. అంతర్జాతీయ అంతరిక్షంలోకి వెళ్లిన జపాన్ కిరోబో రెండు గిన్నీస్ అవార్డులను గెలుచుకుంది. అంతరిక్షంలో వ్యోమగాములకు సహకారం అందించే తొలి రోబోగా ఒకటి, భూమి నుంచి దూరంగా అత్యంత ఎత్తుకు వెళ్లిన మొదటి రోబోగా రెండవ అవార్డు సొంతం చేసుకుంది.

భూమి మీదకు చేరుకున్న కిరోబోకు ఈ అవార్డులను అందించారు.

1 comment: 1. పలుకుకు కిరోబొ తోడుగ
  కలకల ఆకస జిలేబి గారాబు గనెన్
  అల యంతరిక్షమున దా
  పుల నుండెను తోడుగ కలుపుచు మాటలనూ !

  జిలేబి

  ReplyDelete