Sunday, July 31, 2016

మిస్టరీ: ఆకాశంలో మంటల ప్రదర్శన(నిత్య తుఫాను).....ఫోటోలు మరియు వివరాలు

ప్రపంచంలోనే అతిగొప్ప ప్రకృతి శబ్ధం పిడుగు. అదేలాగా ప్రపంచములోనే అతిగొప్ప ప్రకృతి వెలుతురు మెరుపు. ఈ రెండూ కలిపి ఇచ్చే ప్రదర్శనను ఒక్కసారిగా చూడటం మనకు వర్షాకాలంలో మాత్రమే సాధ్యపడుతుంది. అది కూడా కొద్ది క్షణాలు, కొన్ని నిమిషాలు మాత్రమే చూడగలం.
కానీ ఈ అద్భుతమైన ప్రకృతి ప్రదర్శన రోజుకు 10 గంటల చొప్పున, సంవత్సరంలో 160 రాత్రులు, అది కూడా ఒకే ప్రదేశంలో క్రమం తప్పకుండా కనబడుతోందంటే వింతగా లేదు?
వెనుజులా దేశములోని క్యాటాటుంబో(Catatumbo) నది పైన ఈ వింత ప్రదర్శన గత కొన్ని శతాబ్దాలగా జరుగుతోందట. వెనుజులా దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. ఈ దేశములో అపార చమురు నిల్వలు కలవు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఏంజెల్స్ జలపాతము ఈ దేశములోనే ఉన్నది.
ఒక తుఫాను 40,000 వోల్టేజ్ వెలుతురుతో కూడిన పిడుగులను/మెరుపులను ఆ నదిపైన ఒక ప్రాంతములో విరజిమ్ముతూ ప్రదర్శన ఇస్తుంది. ఈ ప్రదర్శన 10 గంటలపాటూ ఉంటుంది. ప్రతి రోజూ, ఒకే ప్రాంతంలో, ఒకే సమయానికి ప్రదర్శన ఇస్తూ...అలా వరుసగా 160 రోజులు క్రమం తప్పకుండా ప్రదర్శన ఇస్తుంది. అలా శతాబ్దాలపాటూ జరుగుతూ ఉండటం శాస్త్రవేత్తల పరిశోధనలకు అందక ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

ఈ ప్రదర్శనను తరచూ చూస్తూ ఉండే వాయువ్య వెనుజులా దేశ ప్రజలు ఈ ప్రదర్శనా సంఘటనను వారి భాషలో "రిబ్-బ-బా" అని పిలుస్తారు. దీనికి అర్ధం"ఆకాశంలో మంటల నది" అని అర్థం. దీనిని వారి భాషలో ‘Relámpago del Catatumbo’ అని కూడా చెబుతారు. దీనికి అర్ధం "నిత్య తుఫాను" అని భావం.

ఈ నిత్య తుఫాను సంవత్సరానికి 1.2 మిల్లియన్ల పిడుగులను(ఉరుములను)ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉరుముల మెరుపును 250 మైళ్ళ దూరం నుండి చూడవచ్చు. శతాబ్దాలుగా ఈ ఉరుముల వెలుతురు ఆ ప్రాంతములులోని మత్స్యకారులకు, నావికులుకు దారిచూపే మార్గదర్శినిగా ఉపయోగ పడుతూ వచ్చిందట. ఇప్పుడు ఈ ప్రాంతం ఒక అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది.
"రాత్రంతా తళతళలాడుతూ కనిపించే ఆ వెలుతురు అపూర్వమైనదనే ఆలోచన అక్కడి నివాసులకు రాలేదు. ఇది ప్రపంచంలో మరింకెక్కడా సంభవించటంలేదనే విషయం కూడా వారికి తెలియదు. తరతరాలుగా ఏర్పడుతున్న ఆ మెరుపులపై వారు ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ద చూపించలేదు. అవి సాధారణ జీవితంలో భాగంగా భావించేరు" సంవత్సరంలో సగానికిపైగా ఆ ప్రాంతంలోని నివాసులతో జీవితాన్ని గడుపుతున్న టూర్ ఆపరేటర్ మరియు ఫోటోగ్రాఫర్ Alan Highton తెలిపేరు.
ఉరుములతో కూడిన ఆ మెరుపులు రాత్రిపూట ఆకాశాన్నంతా అద్భుతమైన రంగుల కలయికతో ప్రకాశింపచేస్తాయి. రంగులలోని తేడా అప్పుడు గాలిలో ఉండే అణువులపై ఆధారపడి ఉంటుంది. పొడి గాలిలో ఆ మెరుపులు తెల్లగా కనబడతాయి. కారణం అప్పుడు ఆ మెరుపులోని తెల్లటి కాంతి కిరణాలు బలమైనవిగా ఉంటాయి. కానీ గాలిలో తేమ ఉన్నప్పుడు హైడ్రోజన్ అణువులు ఒక బలమైన ఎర్ర గీతను సృష్టిస్తాయి. అప్పుడు మెరుపులు ఎరుపు నీలం కలసిన రంగులో కనబడతాయి.
"రిబ్-బ-బా" ఎలా ఏర్పడుతోందనడానికి నిజమైన శాస్త్రీయ వివరణ లేదు. ఎందుకు ఏర్పడుతోందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ సంవత్సరాలుగా ఏర్పడుతున్న "రిబ్-బ-బా" గురించి అక్కడి ప్రజలలో సొంత సిద్ధాంతాలు చోటుచేసుకున్నాయి. ఆ నది ప్రాంతంలో వీచే వేగమైన గాలులు ఆన్డియన్ పర్వతాలను తాకినప్పుడు ఏర్పడు మేఘాల వలన "రిబ్-బ-బా" ఏర్పడుతోందని కొందరు అభిప్రాయపడుతుంటే, చివచివలాడే చిత్తడినేలలు వెలువరిచే మీథేన్ వాయువు వలన "రిబ్-బ-బా" ఏర్పడుతోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ గ్రామ పెద్ద మాత్రం క్యాటటుంబో నుండి బయటకు వచ్చే ఆత్మే రాత్రిపూట ఆకాశాన్ని వెలిగిస్తోంది అంటున్నారు.

భూమిపై ఉన్న ట్రోపో ఆవరణ ఓజోన్ ఈ నిత్య తుఫాను ఏర్పడటానికి కారణమని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

ఈ ఆకాశ మంటల ప్రదర్శనలో మరింత రహస్యమైన, మరింత అనుమానాస్పద మిస్టరీ ఏమిటంటే కొన్నిసార్లు ఈ ఆకాశ మంటల ప్రదర్శన ఆకస్మికంగా ఆగిపోతుంది. "104 సంవత్సరాల నిరంతర ప్రదర్శన తరువాత 2010-జనవరి నెలలో ఈ ప్రదర్శన ఆగిపోయింది. కొన్ని వారాల తరువాత మళ్ళీ తిరిగి ఏర్పడింది. ఎందుకు ఆగిందో మాకు తెలియదు. 1906లో కొలంబియా, ఈక్వడార్ దేశాలలో అతిపెద్ద భూకంపం ఏర్పడి సునామీకి దారి తీసినప్పుడు ఆకాశ మంటల ప్రదర్శన ఇలాగే ఒక సారి ఆగిపోయింది" అని ఆ గ్రామ పెద్ద తెలిపేరు.
కొందరు శాస్త్రవేత్తలు ఆకాశంలో మంటల ప్రదర్శన ఆగిపోవటానికి వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో, లా నినా కారణాలు కావచ్చని చెబుతున్నారు.
ఏది ఏమైన ఆకాశంలో మంటల ప్రదర్శన ఆగిపోవటం(కొద్ది వారాలే అయినా) స్వదేశీ ప్రజలకు లాంఛనప్రాయ దెబ్బ. ఎందుకంటే ఇది అధికంగా వెనుజూలా దేశ పురాణములు మరియు సంస్కృతిలో చోటుచేసుకుంది. ఆకాశంలో మంటల ప్రదర్శన వెనుజులా దేశాన్ని 1595లో ఆంగ్లేయుల దాడి నుండి కాపాడిందని, మరెన్నో ప్రకృతి వైపరీత్యాల నుండి వెనుజులాను రక్షించిందని తెలుపబడింది.

Saturday, July 30, 2016

కాలిఫోర్నియా అడవుల్లో ఆరని మంటలు....ఫోటోలు

కాలిఫోర్నియా అడవుల్లో సెప్టెంబరు 12, 2015 న మొదలైన మంటలు కాలిఫోర్నియా రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి వల్ల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పర్యావరణానిక తీవ్ర హాని కలిగింది. దీనిని అమెరికా అధ్యక్షుడు ఒబామా “భారీ" విపత్తుగా ప్రకటించారు.

నాలుగేళ్ల వరుస కరవుతో చాలా చెట్లు చనిపోవడం వల్ల ఈ మంటలు ఇంత పెద్దగా విస్తరించాయని నిపుణులు చెబుతున్నారు.

సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో ఇక్కడ వైల్డ్ ఫైర్ సాధారణంగా వస్తుంటాయి. కానీ ఇది కాలిఫోర్నియా రాష్ట్ర చరిత్రలోనే పెద్ద అగ్ని విపత్తు.

33వేల ఎకరాల్లో అటవీప్రాంతం ఇప్పటికే నాశనం అయ్యింది. దాదాపు 9వేల మంది అగ్నిమాపక సిబ్బంది అహోరాత్రులు కష్టపడుతున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. లాస్ ఏంజిల్స్కు ఉత్తరదిశలోని ఏంజిల్స్ నేషనల్ ఫారెస్ట్ కాలిపోతోంది. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్నికి ఆజ్యం పోసినట్లు గాలులు కూడా తోడయ్యాయి. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Friday, July 29, 2016

ఎడారి హోటల్(రిసార్ట్): కాంక్రీట్ లేకుండా(ఉపయోగించకుండా) కట్టబడ్డ ఏకైక సృష్టి....ఫోటోలు మరియు వివరాలు

ఎడారి అంటే ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం అనేది అందరికీ తెలుసు. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సు లు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి. ఒయాసిస్ అంటే ఎడారిలో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతం. ఎడారిలో కూడా అప్పుడప్పుడూ వర్షం పడుతుంది. ఈ వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి క్రింద, అనగా రాతి పొర క్రింద, ఊటగా ఉంటుంది. ఎడారిలో ఇసుక రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్లా చెదురవుతాయి. అలా కొండల్లాంటి ఇసుక మేటలు ఒక చోటినుండి మరొక చోటికి కదులుతుంటాయి. ఒక ఘన మైలు (a cubic mile....1.6 ఘన కిలోమీటర్ cubic km) గాలి ద్వారా 4,600 టన్నుల ఇసుక ఒకచోటినుండి మరొక చోటికి కదులుతుంది. ఒక పెద్ద గాలి దుమారం 100 మిలియన్ టన్నుల ఇసుక లేదా మట్టిని స్థాన భ్రంశం చేస్తుంది. ఇలా ఇసుక మేటలు కదిలే ప్రక్రియలో కొన్ని ప్రాంతాలలో ఒరవడికి అక్కడి ఇసుక కొట్టుకుపోయి పల్లపు ప్రదేశం ఏర్పడుతుంది. ఆ పల్లపు భూతలం దాదాపు భూగర్భ జలం(water table) దగ్గరగా వస్తుంది. అలాంటిచోట పడిన విత్తనాలు మొలకెత్తి, వాటి వేళ్ళు క్రింద ఉన్న తడి ప్రదేశంలోకి విస్తరిస్తాయి. అక్కడ నీటి ఊటలు పైకి వచ్చి ఒయాసిస్గా ఏర్పడతాయి. ఒకో చోట ఇలా ఏర్పడిన పల్లపు ప్రాంతాలు చాలా విశాలమైనవి. ఉదాహరణకు సహారా ఎడారిలోని "ఖర్గా ఒయాసిస్" సుమారు 100 మైళ్ళ పొడవు, 12 నుండి 50 మైళ్ళ వరకు వెడల్పు అయినది.
అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం . ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.
ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిద్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు, కొన్ని రకాల కప్పలు ఇందులో ముఖ్యమైనవి.

అలాంటి ఎడారులలో ఒకటైన ఒక ఎడారిలోనే ఈ ఎడారి హోటల్(రిసార్ట్) కట్టేరు.
మంగోలియా దేశంలోని విస్తారమైన ఇసుక సముద్రం అని పిలువబడే ఎడారిని క్సియాంగ్షావన్ ఏడారి(Xiangshawan Desert) అని పిలుస్తారు. ఈ ఎడారిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని చెబుతారు. ఈ ఇసుక ఎడారిలోని ఇసుక దిబ్బల మధ్య ప్రాంతంలో అద్భుతమైన ఒక హోటల్ నిర్మించేరు. ఈ హోటలుకు "ఎడారి తామర పువ్వు హోటల్"(Desert Lotus Hotel) అని పేరు పెట్టేరు. ఇది చైనా రాజధాని బీజింగ్ నగరానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాంక్రీట్ లేకుండా(ఉపయోగించకుండా) కట్టబడ్డ ఏకైక సృష్టి. ఈ హోటల్ ప్రసిద్ధి చెందటానికి కాంక్రీట్ ఉపయోగించని భవనం అనేది మొదటి కారణమైతే, ఎడారులలో తేలే ఓడల డిజైన్ కలిగి ఉన్నదనేది రెండవ కారణం.
మంగోలియా ఒక భూపరివేష్టిత దేశం. ఇది తూర్పుఆసియా మరియు మధ్యాసియాలో వున్నది. దీనికి ఎల్లలు ఉత్తరాన రష్యా, దక్షిణం, తూర్పు మరియు పడమరలలో చైనా దేశాలున్నాయి.

ఈ హోటల్ పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ కార్బన్ డయాక్సైడ్ వెలువరిచే భావనతో నిర్మించేరు.
ఎడారి ఇసుక దిబ్బలలో హోటల్ కట్టాలి కనుక కాంక్రీట్ మరియు నీరు ఉపయోగించకుండా ఒక కొత్త నిర్మాణ వ్యవస్థను కనుగొన్నారు. ప్లాట్ ఆర్కిటెక్ట్స్ అనే సంస్థ ఈ తడి ఇసుకలో నిలబడగలిగే కొత్త ఇంజనీరింగ్ పద్దతిని కనుగొన్నది. ఉక్కు ప్యానెల్స్ తో పునాదిని తయారుచేసి, ఆ పునాదిపై ఉక్కు ఊచలతో హోటల్ నిర్మాణం చేసేరు. పునాది ఉక్కు ప్యానల్స్ పైన ఉక్కు స్ప్రింగులతో ఊచలు నిర్మించడంవలన హోటల్ తేలుతున్న భావన కలుగుతుంది(ఎడారి గాలికి కొంచంగా ఊగటం వలన). 30,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టబడిన ఈ హోటల్ ఎత్తు 40 మీటర్లు. నిర్మాణంలో హోటల్ పైకప్పులను పునరావృతమైన త్రిభుజాకార తెల్లటి గుడారాలతో వరుసక్రమంలో అమర్చేరు. అయితే 45 డిగ్రీల భ్రమణంతో ఒకదానికొకటి కలుసుకునేటట్లు తామర పువ్వు ఆకారంలో నిర్మించేరు. ఇటికలు, రాతి పలకలు, కాంక్రీట్ లేకుండా నిర్మించబడ్డ ఈ నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులు సౌర, నీటి మరియూ పవన విద్యుత్ శక్తిని మాత్రమే ఉపయోగించుకుంటాయి. దీని వలన పర్యావరణ కాలుష్యం తగ్గటమే కాకుండా, జీవావరణ రక్షణను బలపరిచేటట్లు చేస్తుంది.
ఈ హోటల్ వారు పర్యాటకులకోసం మంగోలియా దేశ సంస్కృతిక నేపథ్యంతో ప్రదర్శనలు, ఒంటె సవారీలు, ఎడారి సర్ఫింగ్ లాంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఎడారి “పాటలు పాడే” ఎడారిగా ప్రసిద్ది చెందింది. ఎడారిలో శాంతంగా ఉండే మట్టిని భగ్నపరిస్తే గర్జించు మరియు విజృంభిస్తున్న శబ్ధం వినబడుతుంది(ఈ ప్రకృతి సంఘటన ఎందుకు/ఎలా జరుగుతోందో ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు).
ఈ ఎడారిలో కొన్ని రోజుల గడపటానికి, ఇసుక దిబ్బలు పాడే పాటలను వినడానికి, తేలే హోటల్ యొక్క ఇంజనీరింగ్ వండర్ను చూడటానికి ఎంతోమంది పర్యాటకులు వచ్చి వెడుతున్నారట.

యంత్రాలు మానవ జీవితాలను శాసిస్తాయా?....ఫోటోలు మరియు వివరాలు

భవిష్యత్తులో యంత్రాలు మానవ జీవితాలను శాసిస్తాయా?...అనే ఈ ప్రశ్నకు చాలా మంది శాస్త్రవేత్తలు "అవును" అని ఖచ్చితమైన సమధానం చెబుతున్నారు. ఈ మధ్య ప్రతి యంత్రము కృత్రిమ మేధో యంత్రముగానే తయారుచేయబడుతోంది. మనుష్యులు చేయవలసిన పనులను యంత్రాలు చేస్తున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే మనుష్యులు తమ మేధస్సును పెద్దగా ఉపయోగించవలసిన అవసరం లేకుండానే మేధో యంత్రాలను(ముఖ్యంగా కంప్యూటర్లను)వాడుతూ ఎన్నో విభాగాలలో అద్భుత పురోగతి సాధించగలుగుతున్నారు. దీనికి కారణం ఈ కృత్రిమ మేధో యంత్రాలే అంటున్నారు శాస్త్రవేత్తలు. దీనివలన మనిషి తన మేధస్సును ఉపయోగించవలసిన అవసరం తగ్గుతుంది.
మనిషి మెదడు ఒక పొలం లాంటిది. ఎంత ఉపయోగిస్తే అంత బాగా ఉపయోగపడుతుంది. ఉపయోగించడం మానేస్తే మందగిస్తుంది. మెదడు మందగిచడంవలన మేధస్సు తగ్గిపోతుంది.

“మనిషి ఈ కృత్రిమ మేధో యంత్రాలను ఒక దశ వరకు వృద్ధి చేసిన తరువాత యంత్రాలకి సొంత సోయి ఏర్పడుతుంది. ఆ తరువాత అవి తమకు తామే మేధస్సును వృద్ధి చేసుకుంటాయి. అప్పుడు జీవ పరిమాణం మెల్లగా సాగుతుంది కనుక మానవుడి మేధస్సు వేగంగా వృద్ధి చెందలేదు. అందువల్ల కృత్రిమ మేధో యంత్రాలు ఆధిపత్యం పొందగలుగుతాయి” అని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తెలిపేరు. గతంలో హాకింగ్తో పాటు ఇదే అంశంపై ఒక పత్రికలో వ్యాసం రాసిన ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఇదే హెచ్చరికను చేశారు.

కృత్రిమ మేధస్సు అనేది యంత్రాల మేధస్సు మరియు వాటిని రూపొందించడానికి ఉపయోగించే కంప్యూటర్ శాస్త్రంలో ఒక విభాగం. మేధో వ్యవస్థ అనేది దాని పరిస్థితులను గ్రహించి, విజయావకాశాలను అధికం చేసే చర్యలను నిర్వహించే ఒక వ్యవస్థ. జాన్ మెక్కార్తే మొట్టమొదటిగా ఈ పదాన్ని 1956లో ఉపయోగించారు, దీన్ని "మేధో యంత్రాలను తయారు చేసే శాస్త్రం మరియు రచన"గా అభివర్ణించాడు.
ఈ రంగం మానవ జాతి కేంద్ర బిందువైన మేధస్సుతో ఒక యంత్రం ద్వారా కూడా చేయవచ్చనే ప్రతిపాదనపై కనుగొనబడింది. ఇది మెదడు స్వభావం మరియు శాస్త్రీయ దర్పం యొక్క పరిమితులు, ప్రాచీనత్వము నుండి కల్పిత గాథ, సృజనాత్మక రచన మరియు తత్త్వ శాస్త్రం వివరించిన సమస్యల గురించి తాత్విక సమస్యలకు తెర తీసింది. కృత్రిమ మేధస్సు అనేది ఉత్కంఠభరితమైన నమ్మకం యొక్క విషయం, మరియు సాంకేతిక శాస్త్రంలో ముఖ్యమైన భాగంగా అవతరించడమే కాకుండా కంప్యూటర్ శాస్త్రంలో అత్యంత క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు.
కృత్రిమ మేధస్సు పరిశోధన అత్యంత సాంకేతికం మరియు విశేషమైనది, ఎంతగా అంటే కొందరు విమర్శకులు ఈ రంగాన్ని భాగాలుగా విభజించడాన్ని ఖండిస్తారు. కృత్రిమ మేధస్సు ఉపరంగాలు కొన్ని విశేషమైన సమస్యలు, విశేషమైన సాధనాల అనువర్తనం మరియు దీర్ఘకాలిక అభిప్రాయ భేదాల చుట్టూ కేంద్రీకరింపబడ్డాయి. వాద సరళి, పరిజ్ఞానం, యోజనము, అభ్యాసం, సంభాషణ, గ్రాహ్యత మరియు వస్తువు కదలిక మరియు నియంత్రణ ఇవన్నీనే ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు. ఇప్పటి వరకు వృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం ఎంతో ఉపయోగకరమైనది.
కృత్రిమ మేధస్సును సృష్టించడం మానవ చరిత్రలో అతి పెద్ద ఘటన మాత్రమే కాదు, చిట్టచివరి ఘటన అని వారు అభిప్రాయపడ్డారు.
కృత్రిమ మెదడును తయారు చేయడానికి ఒక కంపెనీని స్థాపించిన బృందంలో ఒకరైన వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్ కూడా కృత్రిమ మేధస్సు పట్ల జాగ్రత్తగా ఉండాలని, అది అణ్వస్త్రాల కన్నా ప్రమాదకరమని అంగీకరించాడు. అయితే ఈ వాదనలను ఖండించే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కంప్యూటర్లు మహా మేధోవంతంగా తయారు కావడం ఇప్పట్లో జరిగేది కాదు. ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నదని వారంటున్నారు. కృత్రిమ మేధస్సు విషయమై అతిగా ఆందోళన చెందుతున్నామనే వారూ ఉన్నారు. కృత్రిమ మానవులను లేదా రోబోలను తయారు చేయడం ప్రమాదకరమని సూచించే సినిమాలు కూడా ఇటీవల చాలా వచ్చాయి. ఊహలు, ఆందోళనల మధ్యనే శాస్త్ర విజ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటుంది.

అయితే తక్షణం మనం భయపడ వలసింది మానవుల చెడగొట్టు బుద్ధి గురించే! ఇప్పుడున్న అణ్వస్త్రాలతో మానవాళిని ఒకసారి కాదు, అనేకసార్లు నాశనం చేయవచ్చు.
మానవుల ప్రమేయం లేకుండా రోబోల ద్వారా యుద్ధం చేయించడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రోబోలు సొంత సైనికులపైనే తుపాకులు గురిపెట్టడంతో ఉపసంహరించుకున్నారు. పైలట్ లేని డ్రోన్ విమానాలు సైనిక దాడులకు ఉపయోగపడుతున్నాయి. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు శ్రమించి రూపొందించే కృత్రిమ మేధస్సు స్వయంగా మానవులను నాశనం చేయకపోవచ్చు. కానీ వివిధ దేశాల పాలకులు, వ్యాపార సంస్థలు ఆ మేధో యంత్రాలను ఏ అవసరాలకు వాడుకుంటారనేదే ప్రశ్న. విజ్ఞానాన్ని సమాజ హితానికి కాకుండా, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.

Thursday, July 28, 2016

ఏంజల్ ఫ్లైట్: ప్రపంచంలోని అతి చిన్న రైల్వే.....ఫోటోలు

అమెరికాలోని లాస్ ఏంజల్ నగరంలో 1901 న ఈ రైల్వే మొదలుపెట్టబడింది. ఈ రైల్వే మొత్త దూరం 315 అడుగులు మాత్రమే. మధ్యలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ రైల్వే ప్రపంచలో ఉన్న మిగిలిన రైల్వేల కంటే అత్యధిక ప్రయాణీకులను మోసుకెళ్ళిందని చెబుతారు.

పేలుతున్న అగ్నిపర్వత మంటల నుండి వస్తున్న మెరుపులు....ఫోటోలు మరియు వీడియో

జపాన్ దేశ దీవి Kyushu లో ఉన్న Sakurajima అనే అగ్నిపర్వతం మంగళవారం నాడు పేలింది. అప్పుడు పేలుతున్న ఆ అగ్నిపర్వతం నిప్పులలోనుండి 5,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసిపడింది. అప్పుడు ఆ మంటలతో పాటు మెరుపులు కూడా చోటుచేసుకున్నాయి. ఈ అగ్నిపర్వతం పేలడం ఇది 47 వ సారి. ఈ అగ్నిపర్వతం పేలబోతోందని ప్రబుత్వం తెలియజేయడంతో అక్కడి ప్రజలు వేరు ప్రాంతాలకు తరలించబడ్డారు.
కొంతమంది పత్రికా విలేఖరులు అక్కడ బస చేసి పేలుతున్న అగ్నిపర్వతాన్ని వీడియో తీసేరు.

వీడియో