Saturday, November 22, 2014

మాంచెస్టర్ మ్యూజియంలో కదిలే విగ్రహం.....ఫోటోలు మరియూ వీడియో

మాంచెస్టర్ మ్యూజియం మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి సొంతమైనది. ఈ మ్యూజియంలో పురావస్తు, నృశాస్త్రం మరియు సహజ చరిత్రకు సంబంధించిన రచనలు, వస్తువులు ఉంచబడతాయి.

అలా ఉంచబడిన వస్తువులలో ఒకటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న కదిలే విగ్రహం. ఈ విగ్రహం ఈజిప్ట్ దేశ అతి పురాతన విగ్రహం. ఈ విగ్రహం పేరు నెబ్-సెను. ఇది 1800 B.C. కాలానికి చెందినది. గత 80 సంవత్సరాలుగా మాంచెస్టర్ మ్యూజియం లో ఒక అద్దపు పెట్టెలో భద్రపరచబడి ఉన్నది.


ఈ విగ్రహం ఎప్పటి నుండి కదులుతున్నదో తెలియదు. ఒక రోజు మాంచెస్టర్ మ్యూజియం లో ఈజిప్ట్ దేశ వస్తువులను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతలు తీసుకున్న క్యాంప్ బెల్ ప్రైజ్ అనే వ్యక్తి ఈ విగ్రహం కదలడాన్ని చూసి ఆశ్చర్యపోయేడు. అతను చూస్తున్నప్పుడే ఆ విగ్రహం కదలడం ఆగిపోయింది. అప్పుడు ఆ విగ్రహం పర్యాటకులకు తన వెనుక వైపును చూపిస్తున్న ధోరణిలో స్థానం మార్చుకుని ఉన్నది. కొద్ది క్షణాలు భయాందోళణకు గురైన క్యాంప్ బెల్ ప్రైజ్ ధైర్యం తెచ్చుకుని అద్దపు పెట్టెను తెరిచి ఆ విగ్రహాన్ని మామూలు స్థానంలో(అంటే పర్యాటకులకు విగ్రహం ముఖం కనబడేటట్లు) ఉంచేడు. ఆ బొమ్మను సాయంత్రం అతను మ్యూజియం వదిలి వెళ్లేంతవరకు అప్పుడప్పుడు చూస్తున్నాడు. ఆ విగ్రహం లో ఎటువంటి కదలిక లేదు.


మరుసటిరోజు మ్యూజియం తెరిచినప్పుడు చూసేడు. ఆ విగ్రహం తను ఉంచిన స్థానంలోనే ఉన్నది. అతను మ్యూజియంలో కొన్ని పనులు చూసుకుని వచ్చి చూసినప్పుడు ఆ విగ్రహం తన స్థానాన్ని కొంచంగా మార్చుకోనుంది. ఏమి జరుగుతుందో చూద్దామని అతను కూడా మెదలకుండా ఉన్నాడు. కొద్ది గంటల తరువాత చూస్తే ఆ విగ్రహం మరికొంత పక్కకు తిరిగి ఉంది. మధ్యాహ్నం చూసినప్పుడు ఆ విగ్రహం పూర్తిగా వెనుకకు తిరిగి ఉంది. సరిగ్గా అతను అంతకు ముందు రోజు మొదటిసారిగా ఆ విగ్రహం ఏవైపుకు తిరిగి ఉన్నదో ఆ వైపులో ఉన్నది.


క్యాంప్ బెల్ ప్రైజ్ ఈ విషయాన్ని తన పై అధికారులకు మరియూ మ్యూజియం నిర్వాహకులకు తెలిపేరు. వారందరూ క్యాంప్ బెల్ ప్రైజ్ చెబుతున్నది నిజమా, కాదా అని తేల్చుకోవడానికి రెండురోజులు ఆ విగ్రహాన్ని గమనించేరు. క్యాంప్ బెల్ ప్రైజ్ చెబుతన్నట్లే ఆ విగ్రహం కదులుతున్నదని నిర్ధారించుకున్నారు. వెంటనే వారంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి, ఆ విగ్రహాన్ని మానిటర్ చేయడానికి సి.సి టీ.వి కెమేరాలు ఉంచేరు.

కెమేరాలలో ఆ విగ్రహం కదలడాన్ని చూడగలిగేరు. ఆ విగ్రహం ప్రొద్దున పర్యాటకులు వచ్చినప్పటి నుండి మధ్యాహ్నం లోపే కదులుతున్నదని తెలుసుకున్నారు(రాత్రి పూట కదలడం లేదు). మామూలు కళ్లతో పరీక్షగా చూస్తున్నప్పుడు విగ్రహం కదలడాన్ని చూడలేకపోయిన వారు(స్థానం మారింది మాత్రమే చూడగలిన వారు)సి.సి.టీ.వీ కెమెరాలో విగ్రహం కదలడాన్ని చూసేరు. ఆశ్చర్యపోయేరు.

శాస్త్రవేత్తలను కలుపుకుని పరిశోధనలు మొదలుపెట్టేరు. పది ఇంచుల ఎత్తుమాత్రమే ఉన్న ఆ విగ్రహం 180 డిగ్రీలు మాత్రమే తిరుగుతోంది. అంటే ముందు నుండి వెనుకకు. అందులోనూ పర్యాటకులు వస్తున్నప్పుడే తిరగడం మొదలు పెడుతున్నది. కారణం తన(విగ్రహం)వెనుక వైపు రాసున్న రాతలను పర్యాటకులు చూడాలనే. ఆ విగ్రహం వెనుక "బ్రెడ్డు, బీరు, ఎద్దులు, కోడి సమర్పించుకోండి" అని రాసుంది. ఈ రాతలు పర్యాటకులు చూడాలనే ఆ విగ్రహం అలా తిరుగుతోందని, ఆ విగ్రహంలో ఆత్మ ఉన్నదని, దానికి ఆహారం కావాలనే అలా తిరుగుతోందని పరిశోధకులు తెలియజేసేరు.


విషయం తెలుసుకున్న ప్రభుత్వం సి.సి.టీ.వీ కెమేరాలలో రికార్డైన దాన్ని చూసి అసలు విషయం ప్రపంచానికి తెలుపాలని ఒక శాస్త్రవేత్తల కమిటీని నియమించింది. వారు పరిశోధనలు చేసి, అది అతి చిన్న విగ్రహం కనుక మ్యూజియంకు వచ్చే పర్యాటకుల కదలికల వలన, వారి కంపనములకు కదులుతున్నదని మరియు విగ్రహం యొక్క కుడి, ఎడమల బరువు తేడాగా ఉన్నందువలన ఆ విగ్రహం కదులుతున్నదని తెలిపేరు.


పర్యాటకుల కదలికల వలన విగ్రహం కదులుతున్నది అనడానికి సైన్స్ లో ఒక లెక్క ఉన్నది. స్టిక్ లిప్ వైబ్రెషియో అనే లెక్క. ఈ లెక్క ప్రకారం ఆ విగ్రహం కదులుతున్నదని ఒప్పుకోవచ్చు, కానీ 1933 నుండి అక్కడున్న ఆ విగ్రహం 2013 లోనే కదలటానికి కారణమేమిటి? అంతకు ముందు ఎందుకు కదలలేదు? స్టిక్ లిప్ వైబ్రెషియో ప్రక్రియలో కదులుతున్నది అనే నిర్ణయానికి వస్తే ఎందుకు విగ్రహం సరిగ్గా వెనుకకు వరకే తిరిగి ఆగిపోతోంది? పూర్తిగా ఎందుకు తిరగటంలేదు? పర్యాటకులు సాయంత్రం వరకు వస్తున్నారు కాబట్టి స్టిక్ లిప్ వైబ్రెషియో ప్రక్రియలో ఆ విగ్రహం ఎందుకు మళ్ళీ ముందుకు తిరగటంలేదు? మధ్యాహ్నం వరకే తిరిగి ఎందుకు ఆగిపోతోంది?...అనే మిగిలిన శాస్త్రవేత్తలూ, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు.

ఈ ప్రశ్నలకు సమాధనం చెబుతామని అంటున్నారు కానీ ఇప్పటి దాకా ఎటువంటి సమాచారమూ వారు అదివ్వలేకపోవటం మూలంగా ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

దీని గురించిన వీడియోను ఈ క్రింద చూడవచ్చు

No comments:

Post a Comment