Saturday, January 11, 2014

ఉత్తరాయణం/మకర సంక్రాంతి మరియూ పొంగల్.....ఫోటోలు

ఉత్తరాయణం:....ఆయనం అనగా పయనించడం అని అర్ధం. ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్ధం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.


సుర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సుర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒక వైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సుర్యుడు భూమిపై దక్షిణం వైపుకి పయనిస్తున్నంతకాలం రాతిరి గాను, ఉత్తరం వైపుకి పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు.


మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏవిధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని ప్రజలందరికి ఈ విషయం తెలియజేయడం కోసం పెద్దలు పండుగలను జరపడం మొదలు పెట్టారు. ముక్కోటి ఏకాదశి దేవతలకు తెల్లవారుజాముగా నిర్ణయించి దేవతలు నిద్రలేచే వేళ అయిందని ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు వెళ్లి స్వామి వారి దీవెనలను అందుకుంటారు. అలాగే వైకుంఠం నందు ముక్కోటి ఏకాదశి రోజున ద్వారాలు తెరిచి ఉంటాయని అన్ని విష్ణు దేవాలయాలలో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.


మకర సంక్రాంతి: సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.


భిన్నజిల్లా ప్రజలు వైభవంగా జరుపుకుంటారు, ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.


భోగి:....ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.


సంక్రాంతి:....ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.


కనుమ:....మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు.


ఒక విధముగా దీనిని ద్యాంక్స్ గివింగ్ డే(ధన్యవాదాలు తెలిపేరోజుగా)అని చెప్పవచ్చు. ఈ మూడురోజులూ ఎన్నో రకాల ఆటపాటలతో సరదాగా గడుపుకుంటారు.

ఈ సంధర్బంగా అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు.

1 comment:

  1. మిత్రమా, మీరు సంక్రాంతి పండుగ విశిష్టత మాకు తెలియ చేయాలన్న ప్రయత్నం శ్లాఘనీయము. సూర్యుడు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు వైపు పయనించడం నాకు బోధ పడలేదు. నాకు తెలిసినంత వరకు సూర్యునికి చలనము లేదు, భూభ్రమణం ద్వారానే సూర్యుడు తిరుగుతున్నట్టుగ కనిపిస్తుంది. భూమి తన చుట్టూ తానూ తిరగడం వాళ్ళ రాత్రి పగలు, సూర్యుని చుట్టూ తిరగడం వాళ్ళ కాలములు ఏర్పడుతాయని తెలుసు.

    భూమి పూర్ణంగా గుండ్రంగా లేకపోవడం వల్ల, సూర్యుని చుట్టూ భ్రమిస్తున్నప్పుడు, 6 నెలలు సూర్యుడు భూమికి ఉత్తరంగా ప్రకాశించడం వల్ల ఇప్పటినుంచి భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న దేశాలకు ఎక్కువ వేడి రావడం ఆరంభమవుతుంది. ఇదే ఉత్తరయాణము.

    మీరు దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయి అని చెప్పారు. దేవతలు అంటే ఎవరు? దేవుడు ఒక్కడే. అతడు అనంతుడు, అనాది, సర్వాంతర్యామి, నిరాకారుడు, అజరుడు, అమరుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు సృష్టి ఆరంభమే పగలు ప్రళయ కాలమే రాత్రి. సూర్య చంద్రాది, గ్రహాలూ, మానవుల కోసమే సృష్టించ బడ్డాయి ఈశ్వరుని చేత.

    ధన్యవాదములు.

    ReplyDelete