Monday, December 2, 2013

ఉత్పత్తుల కొనుగోలును డ్రోన్ ద్వారా 30 నిమిషాలలో పంపటానికి ప్రయత్నాలుచేస్తున్న అమెజాన్‌...వీడియో

ప్రపంచ ప్రసిద్ధ ఆన్‌లైన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ అమెజాన్.కామ్ నుంచి మీరు కొనుగోలు చేసే ఏ వస్తువైనా మీ ఇంటిముంగిట్లోకి అర్ధగంటలో చేరిపోతే ఎంత బాగుంటుంది? ఇది సైన్స్ ఫిక్షన్‌ నవలను తలపించవచ్చు కాని ఇది అసాధ్యం కాదంటున్నారు కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్.


ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల పని పట్టడానికి అమెరికా ప్రభుత్వం ఉపయోగిస్తున్న డ్రోణ్ నిఘా తరహా విమానాల సహాయంతో కస్టమర్లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఉత్పత్తులను అరగంటలో వారి వారి నివాసప్రాంతాల్లో దిగబెట్టే పద్ధతికి కంపెనీ త్వరలో శ్రీకారం చుట్టనుంది.

చిన్న చిన్న ప్యాకేజీలను మీ ముంగిట్లోకి తీసుకు రాగలిగే మినీ డ్రోన్ విమానాలను ఆన్‌లైన్ అమ్మకాల బట్వాడాకు ఉపయోగించనున్నట్లు కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్ తెలిపారు. అదనపు భద్రతా పరీక్షపై అమెరికా ప్రభుత్వ ఆమోదం అవసరమని, దీని తర్వాత మరో అయిదేళ్లలో అమెజాన్ ప్రైమ్ ఎయిర్ ఉనికిలోకి వస్తుందని చెప్పారు.

డ్రోన్‍ల సామర్థ్యం అందరికీ తెలుసుని, కాని వీటిని డెలివరీ వాహనాలుగా తీసుకురావటం సంభవమేనని జెఫ్ విశ్వాసం ప్రకటించారు.

ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ నవలను తలపిస్తున్నప్పటికీ డ్రోన్ వాహనాల సహాయంతో అర్థగంటలోపే మా ఉత్పత్తులను డెలివరీ చేయగలమని అమెజాన్ సీఈఓ తెలిపారు. 2.3 కిలోల బరువుండే వస్తువులను మేం అతివేగంగా సరఫరా చేయగల మన్నారు.

ఆన్‌లైన్‌లో తాము డెలవరీ చేసే వస్తువలలో 86 శాతం వరకు 2.3 కిలోల బరువుకు లోపలే ఉంటున్నందున తమకిది కష్టం కాదని జెఫ్ ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment