Saturday, August 17, 2013

ఈరోజు ఈజిప్ట్....ఫోటోలు

ఈజిప్ట్‌లో ప్రజాస్వామ్యం తిరిగి నెలకొనవచ్చన్న ఆశ గత శుక్రవారం రాత్రి పారిన నెత్తుటేరుల్లో కొడిగట్టిపోతోంది. రాజధాని కైరోలోని రబా అల్ అదావియా మసీదు వద్ద ఇంకా ఆరని నెత్తుటి మడుగుల్లో కనిపిస్తున్న ఈజిప్ట్ భవిష్యత్ చిత్రం భయపెడుతోంది. రబా వద్ద బైఠాయించిన ముస్లిం బ్రదర్‌హుడ్ నిరసనకారులకు, వారిని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్న పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతుండగా... చూస్తున్నట్టు నిలిచిన సాదా దుస్తుల పోలీసులు ఇరువేపుల నుంచి ఆందోళనకారుల తలల్లోకి, ఛాతీలోకి కాల్పు లు జరిపి సాగించిన ఈ హత్యాకాండలో కనీసం 200 నుంచి 450 మంది మృతి చెందారని అంచనా. ప్రత్యక్షసాక్షులతో పాటూ హక్కుల సంస్థ ‘హ్యూమన్ రైట్స్‌వాచ్’ సైతం ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన హత్యాకాండేనని స్పష్టం చేసింది. ఈ హత్యాకాండ తర్వాత కూడా బ్రదర్‌హుడ్ మద్దతుదార్లు రబా వద్ద నుంచి కదల్లేదు. జూలై 3 సైనిక కుట్రలో పదవీచ్యుతుడైన మాజీ అధ్యక్షుడు మొహ్మద్ ముర్సీకి తిరిగి అధికారం అప్పజెప్పాలని బ్రదర్‌హుడ్ కోరుతోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించాలనే షరతుపై అది రాజీకి సిద్ధంగా ఉంది. జాతీయ ఐక్యతతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న సైన్యానికి చిత్తశుద్ధి ఉంటే న్యాయమైన బ్రదర్‌హుడ్ షరతును అంగీకరించేదే. కానీ అది బ్రదర్‌హుడ్ బేషరతు లొంగుబాటును కోరుతోంది.


No comments:

Post a Comment