సత్తాచాటిన హైదరాబాదీ కుర్రాడు అరవింద్ మహంకాళి: వరుసగా ఆరోసారీ అమెరికా "స్పెల్లింగ్ బీ" చాంపియన్‌గా భారతీయ అమెరికన్.... ఫోటోలు మరియూ వీడియో
వరుసగా రెండోసారి ప్రవాసాంధ్రుల జయకేతనం
అమెరికాలో ప్రతిష్టాత్మక ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారతీయ అమెరికన్ విద్యార్థులు తిరుగులేని ఆధిక్యంతో విజయ దుందుభి మోగించారు. మొదటి స్థానమే కాకుండా రెండు, మూడో స్థానాలూ భారతీయులే కైవసం చేసుకున్నారు. 2008 నుంచి వరుసగా ఆరోసారీ ఇండో అమెరికన్‌కే చాంపియన్‌షిప్ దక్కింది. హైదరాబాదీ అమెరికన్ కుర్రాడు అరవింద్ మహంకాళి (13) తాజా పోటీలో జయకేతనం ఎగురవేశాడు.
కఠిన ఆంగ్ల పదాలకు సరైన అక్షరాల క్రమం (స్పెల్లింగ్) చెప్పే ఈ పోటీ ఫైనల్లో ‘నైడెల్ ("knaidel"=కొంత మిశ్రమ పిండిపదార్థం అని అర్థం)’ అనే జర్మన్ పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి అరవింద్ చాంపియన్‌గా నిలిచాడు. ఇంతకుముందు మూడుసార్లు ఈ పోటీలో పాల్గొన్నా.. జర్మన్ భాష నుంచి వచ్చిన ఆంగ్ల పదాల కారణంగా 2010లో 9వ స్థానం, 2011, 2012లో మూడోస్థానంతోనే అరవింద్ సరిపెట్టుకున్నాడు. తాజా ప్రయత్నంలోనూ జర్మన్ పదమే వచ్చినా.. సరైన స్పెల్లింగ్ చెప్పి విజేత అయ్యాడు. లక్షలాది మంది పాల్గొన్న ఈ పోటీలో 281 మంది సెమీఫైనల్‌కు, వారిలో 8 మంది ఫైనల్‌కు చేరారు. ‘మేధస్సు, అక్షరాల కూర్పు, పదజాల సామర్థ్యాన్ని పరీక్షించేలా జరిగే ఈ పోటీలో అడిగే పదాలు చాలా కఠినంగా ఉన్నాయి. అయినా, ఆశాభావంతోనే ముందుకు సాగాను’ అని అరవింద్ ఆనందం వ్యక్తంచేశాడు.
2008 తర్వాత ఒక బాలుడు ఈ చాంపియన్‌షిప్ సాధించడం ఇదే తొలిసారి. గతేడాది తెలుగు అమ్మాయి స్నిగ్ధ నందిపాటి ఈ విజయం సాధించగా, తాజాగా మరో తెలుగు కుర్రాడే సత్తా చాటడం విశేషం. చాంపియన్‌గా నిలిచిన అరవింద్‌కు రూ.15 లక్షల నగదు, ట్రోఫీ అందజేస్తారు. అరవింద్ తండ్రి శ్రీనివాస్ హైదరాబాద్‌కు చెందిన ఐటీ కన్సల్టెంట్ కాగా, తల్లి ఓ వైద్యురాలు. వీరు న్యూయార్క్‌లో ఉంటున్నారు. అరవింద్ తెలుగు, ఆంగ్లం, స్పానిష్ భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు పద్యాలను ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు చదివేలా తండ్రి ప్రోత్సహిస్తుండేవారని, దాంతో భాషలపై మక్కువ ఏర్పడిందని అరవింద్ తెలిపాడు.
Maree toomuch chestunnaru. Deeni kintha scene avasarama.
ReplyDelete