Thursday, September 6, 2012

జంతర్ మంతర్:...మహారాజుల బ్రహ్మాండమైన ఆస్ట్రొనామికల్ అబ్జర్వేటరీ....ఫోటోలు

జంతర్ మంతర్ వేధశాల జైపూర్ మహారాజైన రాజా జైసింగ్-2, జైపూర్ (రాజస్థాన్) లో నిర్మించిన ఒక ఖగోళ వేధశాల. దీని నిర్మాణం 1727 మరియు 1734 ల మధ్యకాలంలో జరిగినది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 వున్నవి. మొఘలుల కాలంలో రాజాజైసింగ్ కొరకు ఢిల్లీ లోనూ ఒక వేధశాల నిర్మింపబడినది. జైపూర్ లో గల వేధశాల అన్నింటికన్నా పెద్దది.


భవనాలే ఖగోళ పరికరాలు

వాస్తు శిల్పానికి శాస్త్రవిజ్ఞానానికి ప్రాచీన భారతావనిలో అవినాభావ సంబంధం ఉండేది. జైసింగ్ వేధశాలలు ఇందుకు ఇటీవలి నిదర్శనాలు. ఖగోళవేత్త మీర్జా ఉలుగ్ బేగ్ పరిశోధనలు 18వ శతాబ్దపు సవాయి జైసింగ్2 ను ఎంతగానో ప్రభావితం చేశాయి. జైపూర్ మహారాజైన జైసింగ్ కూడా స్వయంగా గొప్ప పండితుడు, ఖగోళ శాస్త్రవేత్త. ఉత్తరాది నగరాలైన ఢిల్లీ, ఉజ్జయిని, వారణాసి, మధుర, జైపూర్లలో ఆయన 5 వేధశాలలను నిర్మించాడు. జంతర్ మంతర్లుగా ఇవి బహుళ ప్రాచుర్యం పొందాయి. (జంతర్ మంతర్ అంటే గణక యంత్రం అని అర్థం). పని తీరులోనేగాక నిర్మాణ శైలి పరంగానూ జంతర్ మంతరులు వాటికవేసాటి. పరికరాలను ఉంచే భవనాలుగా కాకుండా, ఆ భవనాలే ఖగోళ పరికరాలుగా ఉపయోగపడేట్లు జైసింగ్ వాటికి రూపకల్పన చేశాడు. అర్ధగోళాలు, విలువంపులు, ఘనాలు, స్థూపాలు, త్రికోణాలు ఇలాంటి రకరకాల రేఖా గణిత ఆకృతుల మేళవింపుతో రూపొందిన జంతర్ మంతర్ లు ఈనాటికీ అత్యాధునిక భవిష్య కాలపు డిజైన్లను తలపిస్తాయి. ఈ విజ్ఞాన సౌధాలు చూడచక్కని నిర్మాణాలు. నిన్నగాక మొన్న ఉపగ్రహాలు వచ్చే వరకూ ఇవే ఖగోళ సంఘటనల కాలాన్ని లెక్కించడానికి ఉపకరించాయి.


జంతర్ మంతర్, జైపూర్

జైసింగ్ నిర్మించిన 5 అబ్జర్వేటరీలలోకీ అతి పెద్దది జైపూర్ లోని జంతర్ మంతర్. 1728-1734 మధ్యకాలంలో దీని నిర్మాణం జరిగింది. సువిశాలమైన ఉద్యానవనంలో ఎర్ర రాతితో కట్టిన ఈ వేదశాల 16 రకాల భారీ పరికరాల (యంత్రాల) సముదాయం. వీటిలో ఒకటైన 'లఘు సామ్రాట్ యంత్రం' జైపూర్ స్థానిక కాలాన్ని (20 సెకండ్ల తేడాతో) ఖచ్చితంగా లెక్కిస్తుంది. భూమధ్యరేఖ నుంచి నక్షత్రాలు, గ్రహాలు, ఎంత కోణంతో ఉన్నాయో 'చక్రయంత్రం'తో గణించేవారు. ఇక్కడ ఉన్న ఇతర పరికరాల ఖచ్చితత్వాన్ని జైప్రకాష్ యంత్రం నిర్థారిస్తుంది. జైసింగ్ తనే స్వయంగా దీన్ని కనిపెట్టాడని విశ్వసిస్తారు.12 భూభాగాలుగా ఉండే రాశి వలయ యంత్రాన్ని జాతక చక్రం వేయడానికి ఉపయోగించేవారు. దీనిలోని ఒక్కోభాగం ఒక్కోరాశికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రామ యంత్రం అనే మరో పరికరంతో ఆకాశమధ్యానికి, భూమ్యాకాశాలు కలిసే చోటుకు మధ్య వంపును కొలిచే వారు. 23 మీటర్ల ఎత్తు ఉండే సామ్రాట్ యంత్రంతో వర్షపాతాన్ని అంచనా వేసేవారు. జైసింగ్ నిర్మిత వేధశాలల్లో జైపూర్ అబ్జర్వేటరీ ఒక్కటే కాస్త దిలంగా ఉంది. మిగిలినవి శిథిలావస్థకు చేరాయి. 1724లో కట్టిన ఢిల్లీ జంతర్ మంతర్ పర్యాటకులకు గొప్ప ఆకర్షణగా ఉంది.


No comments:

Post a Comment