Sunday, January 29, 2012

మాజీ చైనా ప్రధాని చౌ యెన్ లై ని, చార్లీ చాప్లిన్ ని తన నటనతో ఆశ్చర్యపరిచిన విశ్వ నటచక్రవర్తి,నటసార్వభౌమ 'య(శ)స్వి'రంగారావు గారి గురించి

సామర్ల వెంకట రంగారావు గారు (SVR) 03 -07 -1918 న లక్ష్మినరసాయమ్మ,కోటేశ్వర రావు లు అనబడే దంపతులకు కృష్ణా జిల్లా లోని నూజివీడు లో జన్మించారు.స్వస్థలం కాకినాడ.తండ్రి excise inspector గా నూజివీడులోపని చేశారు. తల్లి వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు అవటం చేత కొడుకు కు వెంకట రంగారావు అనే పేరు పెట్టుకున్నారు.

ధనవంతులైన తల్లితండ్రులు ఇతనిని హై స్కూల్ విద్యకే మద్రాస్ పంపించారు.SVR తన 12 వ ఏటనే,హై స్కూల్ విద్య పూర్తి చేసి,B.Sc లో చేరారు. హై స్కూల్ విద్యార్ధి గా ఉన్నప్పటి నుంచి ఇతనికి కళలంటే ఎక్కువ మక్కువ.కాలేజీ లో చదువుకునేటప్పుడే,అతను తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు.డిగ్రీ పూర్తి అయిన తర్వాత,బందరు లో Fire Service డిపార్టుమెంటు లో వుద్యోగం సంపాదించారు.అప్పుడు ఆయన మదిలో రెండు ఆలోచనలున్దేవి, M.Sc లో చేరటమా లేక సినిమా రంగంలో నటుడిగా కృషి చెయ్యటమా! అని.వారి బంధువైన బి.వి.రామానందం గారు SVR ను సినీ రంగానికి ఆహ్వానించారు.ఆ సినిమా పేరు వరూధిని.రంగారావు గారు వెంటనే వుద్యోగం మానివేసి,సిని రంగం లో ప్రవేశించటానికి మద్రాస్ పయనమయ్యారు.వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు.అందుచేత కొంత కాలం వరకు వారికి సినిమాల లో వేషాలు వేసే అవకాశం రాలేదు.తర్వాత రంగారావు గారికి విసుగు పుట్టి,జంషెడ్పూర్ లో TATA వారి సంస్థలో కొన్నాళ్ళు వుద్యోగం చేశారు అయితే అతనికి నటన పైన వున్న ప్రేమ తొలగిపోలేదు,పైగా ఎక్కువ కూడా అయినది.

27 -12 -1947 న లీలావతి అనబడే కన్యామణి తో వీరి వివాహం జరిగినది.SVR గారికి తదుపరి రోజుల్లో 'పల్లెటూరిపిల్ల' అనే చిత్రం లోవిలన్ గా నటించటానికి శ్రీ బి.ఏ. సుబ్బారావు గారి నుండి ఆహ్వానం వచ్చింది.అయితే,దురదృష్టం ఏమిటంటే,వీరు మద్రాస్ వెళ్ళటానికి రైలు ఎక్కే సమయం లో,వారి నాన్న గారు స్వర్గస్తు లైనారని తంతి వార్త వచ్చింది.తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకొని,మద్రాస్ వెళ్ళేటప్పటికి,ఆ వేషం మరొకరికి ఇవ్వబడింది.అదృష్టమేమంటే,విజయా వారి,కే.వి.రెడ్డి గారి దృష్టిలో పడటమే!పాతాళ భైరవి లో నేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ వచ్చింది.వచ్చిన ఆ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా,ఆయన ఆ పాత్ర పోషించిన తీరు పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయా వారికి ఈయన ఆస్థాన నటుడయ్యారు.ఆ తర్వాతనే విదులైన,విజయా వారి'పెళ్లి చేసి చూడు' సినిమాలో వీరు పోషించిన 'వియ్యన్న' పాత్ర కూడా నేపాలీ మాంత్రికుడి వేషం వలె తెలుగువారి గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయింది.దాని తమిళ version లో కూడా అదే పాత్రను పోషించి, తమిళ ప్రజల మన్ననలను కూడా పొందారు.విజయా వారు మాయాబజార్ తీసే టప్పుడు, 'ఘటోత్కచుని' వేషానికి ముందుగా వీరిని తీసుకున్నారు.కే.వి.రెడ్డి గారు అన్నారుట'ఆ వేషానికి వేరే ఆప్షన్ లేదు' అని.మాయాబజార్ అంత రసవంతం గా తయారుకావటానికి ముఖ్య కారకులలో అతి ముఖ్యుడీయన!అలా నిర్విరామమగా వీరి నట యాత్ర తెలుగు ,తమిళ రంగాలలో కొనసాగింది.వీరు నటించిన నర్తనశాల లోని కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది.

సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు ,చైనా ప్రధాని చౌ యెన్ లై ,వీరిని సెట్లో యముని వేషంలో చూసి ఆశ్చర్య చకితులయ్యారట!. జకార్తా లో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్ లో,వీరి కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డు తో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది.ముఖ్యం గా పౌరాణిక సినిమాలలో ప్రతి నాయకుడి గా నటించి తనదైన ఒక ప్రత్యేక బాణీ ని ప్రవేశపెట్టారు. రావణ బ్రహ్మ,దుర్యోధనుడు,హిరణ్యకశిపుడు .మాయల పకీరు,మున్నగు వేషాలు వీరిని తెలుగు ప్రేక్షకుల గుండెలపై చిర స్థాయి గా కూర్చో పెట్టాయి.సంభాషణల ఉచ్చారణ, పలికే విధానం,ఆ విరుపు,హావ భావాలు మరెవరి తరం కావు.యెంత మహా నటుడినైనా Dominate చేయ గల సత్తా సామర్ధ్యం వీరి సొంతం. వీరితో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు,ఒక్క సావిత్రి తప్ప!ఆయన సమకాలీనుడైన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే,ఇటువంటి నటుడు పొరపాటున మన దేశంలో పుట్టాడు,మరే దేంలో నైనా పుట్టివుంటే,ప్రపంచపు నటులలోనే మేటి నటుడయ్యే వాడు!ఇంతకన్నా గొప్ప అవార్డు,రివార్డ్ ఏమున్నది?

“బంగారు పాప” (1955) ఆర్ధికంగా విజయం సాధించక పోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు నటనను,లండన్లో చూసిన చార్లీ చాప్లిన్, ఇలియట్ “బ్రతికి వుంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు. (జార్జి ఇలియట్ రాసిన “సైలాస్ మార్నర్” అన్న ఆంగ్ల నవల 'బంగారుపాప'కు ఆధారం).

చాలా సాంఘీక,చారిత్రిక,పౌరాణిక సినిమా ల లో విభిన్న పాత్రలు పోషించి. తనకు తానే సాటి అని అనిపించుకున్నారు.రంగారావు గారు బంగారు పాప అనే సినిమాలో ఒక గుడ్డివాని వేషం వేస్తున్నారు,అదే సమయంలో NTR గారు చిరంజీవులు అనే సినిమాలో గుడ్డివాని వేషం వేస్తున్నారు.ఇద్దరూ కలిసి పొద్దున్నే,మద్రాస్ రైల్వే స్టేషన్ కి వెళ్లి, గుడ్డి వారి హావభాలు పరిశీలించేవారట! అలా సమాజంలో వున్న వ్యక్తులను పరిశీలించటం వల్లనే, వారి నటన అతి సహజం గా వుండేది!ఆ రెండు సినిమాలలో వారి నటన అందరి మన్ననలను పొందిన విషయం మనందరికీ తెలినదే!తెలుగులో NTR నటించిన'కథానాయకుడు సినిమా యెంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం.అందులో నాగభూషణం అద్భుతం గా నటించారు.అదే సినిమాను తమిళం లో మళ్ళీ తీసేటప్పుడు,నాగభూషణం వేసిన పాత్రను తమిళ సినిమాలో SVR వేశారు.ఆ సినిమా తెలుగులో కన్నా ఘనవిజయం సాధించింది,కేవలం SVR నటన వల్లనే!తమిళం కూడా అనర్గళం గా మాట్లాడే ఆయన,తమిళ సినిమాలలో నటించే టప్పుడు తమిళులు చాలామంది ,వీరు మా తమిలుడే అని భావించే వారట!అగ్ర నటులతో సమానంగా వీరు పారితోషికం తీసుకునే వారట!

వీరికి ముగ్గురు సంతానం.ఇద్దరు ఆడపిల్లలు(విజయ,ప్రమీల)ఒక కుమారుడు(కోటేశ్వర రావు).నిర్మాతగా కూడా మారి విజయవంతమైన నాదీ ఆడజన్మే! ,చదరంగ,బాంధవ్యాలు,సుఖదు:ఖాలు లాంటి సినిమాలను తీసారు.చదరంగం,బాంధవ్యాలు--సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,పలు సంస్థల నుండి చాలా అవార్డ్స్,బిరుదులు పొందారు.
అకస్మాత్తుగా, తీవ్రమైన గుండెనొప్పి వచ్చి,ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యం తీసుకునే సమయంలో,మళ్ళీ మరొక్కసారి గుండెనొప్పి చేత 18 -03 -1974 న తుది శ్వాసవిడిచారు.


ఆ మహనీయునికి నా ఘనమైన నివాళి!!!

అందించినవారు......టీవీఎస్.శాస్త్రి గారు.

No comments:

Post a Comment